మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి అధికారులకు సూచించారు. ప్రతిరోజు ప్రణాళికాబద్ధంగా కొనుగోళ్లు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ మేరకు జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను, సిరికొండ గ్రామం, నడికుడి, మల్లాపుర్ మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ గురువారం సందర్శించారు.
రైతులకు ఇబ్బందులు కలగొద్దు.. కలెక్టర్ అధికారులకు ఆదేశం మొక్కజొన్నలను కొనుగోలు చేసే ప్రక్రియ వివరాలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గన్నీ బ్యాగుల కొరత లేకుండా సెంటర్లను అనుసరిస్తున్న పద్ధతులను, రికార్డులను పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో ఆలస్యం జరగకుండా నాణ్యమైన కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
వ్యవసాయ అధికారులు జారీ చేసిన టోకెన్లు, సంబంధిత పత్రాలు ఆధార్ కార్డు, బ్యాంకు పాస్బుక్, పట్టాదారు పాస్, మొదలగు పత్రాలు తనిఖీ చేసిన పిదప మక్కలను అన్లోడ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. తనిఖీ చేయకుండా ముందుగా అన్లోడ్ చేస్తే రైతులకు ఇబ్బందులు ఏర్పడతాయని తెలిపారు. రైతుల వారీగా కొనుగోలు ప్రక్రియ నిర్వహిస్తున్న రికార్డులు తనిఖీ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.