దేశంలో అంతరించిపోయే దశకు చేరిన దేశవాళి ఆవుల అభివృద్ధికి చర్యలు మొదలయ్యాయి. జగిత్యాల జిల్లా కోరుట్లలోని పశువైద్య విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు మొదటిసారిగా పిండ మార్పిడి పద్ధతి ద్వారా దీనికి శ్రీకారం చుట్టారు. 1925లో దేశవాళి ఆవులైన సాహివాల్, గిర్, ధార్ పార్కల్ వంటి ఆవుల పాల ఉత్పత్తి ఒక ఈత కాలంలో (300 రోజులు) సుమారు 2,500-3,000 లీటర్లు ఉండేది. స్వాతంత్య్రం తర్వాత దేశంలో విదేశీ ఆంబోతుల వీర్యాన్ని కృత్రిమ గర్భోత్పత్తి ద్వారా దేశీయ ఆవులపై ప్రయోగించి సంకరజాతి ఆవుల ద్వారా పాల ఉత్పత్తిని పెంచారు. అవి ఎక్కువ పాలిచ్చినా రోగాలకు గురయ్యేవి. ఎండ తీవ్రతకు తట్టుకోలేకపోయేవి. పోషణకు ఎక్కువ ఖర్చయ్యేది. క్రమంగా దేశవాళి ఆవులు అంతరించిపోయే పరిస్థితి ఏర్పడింది. దీని నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకం ద్వారా ప్రత్యేక చర్యలు మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా మొత్తం 30 యూనిట్లను మంజూరు చేసింది. అందులోభాగంగా జగిత్యాల జిల్లా కోరుట్ల పశువైద్య కళాశాలకు 2019లో పిండ మార్పిడి పద్ధతి (ఐవీఎఫ్ - ఇన్ విట్రో ఫర్టిలైజేషన్) సెంటర్ కేటాయించారు. అధిక పాల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన దేశీయ ఆవుల నుంచి ఆండాలను సేకరించి వాటిని ప్రయోగశాలలో మేలైన ఆంబోతుల వీర్యం ద్వారా ఫలదీకరణ చేస్తారు. ఆ పిండాలను ఎదకు వచ్చిన ఆవుల గర్భాశయంలోకి ప్రవేశపెట్టి మేలు రకం దూడలను పుట్టిస్తారు. ఈ పద్ధతి ద్వారా 100 శాతం దేశవాళి ఆవుజాతి (సాహివాల్) లక్షణాలతో జన్మించిన దూడలకు మొదటి తరంలోనే సుమారు 3000 లీటర్ల పాల ఉత్పత్తి సామర్థ్యం వస్తుంది. 4-5 తరాలు దూడలను పుట్టించి వాటి ద్వారా వచ్చిన ఆంబోతులను వీర్య సేకరణకు ఉపయోగించి కృత్రిమ గర్భధారణ చేయడం ద్వారా దేశవాళి ఆవుల పాల ఉత్పత్తి సామర్థ్యాన్ని ఒక ఈత కాలంలో 5,000-6,000 లీటర్ల (రోజుకు 15-20 లీటర్లు) వరకు పొందవచ్చు.
అన్నదాతలు ముందుకు రావాలి