ఏటా జులై 6వ తేదీన శునకాలు, పశువులకు ముందు జాగ్రత్తలో భాగంగా ఇచ్చే రాబిస్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని కరోనా నేపథ్యంలో వాయిదా వేశారు. పశువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి పశువులకు రాబిస్ వ్యాధి సోకకుండా ప్రముఖ శాస్త్రవేత్త లూయిస్ పాశ్చర్ 1885 సంవత్సరం జూలై 6వ తేదీన యాంటీ రేబిస్ వ్యాక్సిన్ మనుషులపై విజయవంతంగా ప్రయోగించారు. నాటి నుంచి నేటి వరకు జూలై 6ను జూనోసిస్ డే గా పిలుస్తూ పశువులు, పెంపుడు జంతువులకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇవ్వడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు.
కానీ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కారణంగా ఈ సంవత్సరం ఈ నెల ఆరవ తేదీన జూనోసిస్ డే ను నిర్వహించడం లేదని నారాయణగూడ వెటర్నరీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా నగరంలోని అనేక ప్రాంతాల నుంచి పెంపుడు జంతువులను తీసుకొని వందలాది మంది వాటి యజమానులు రావడం వల్ల వైరస్ మరింత విస్తరించే అవకాశం లేకపోలేదని ఆసుపత్రి సిబ్బంది ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని పశుసంవర్ధక శాఖ ఉన్నత అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.