COMPLIANT ON YSRCP ACTIVIST : ప్రశ్నించే వారిపై అధికార పార్టీ నాయకుల వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. విపక్ష పార్టీలతోపాటు సొంత పార్టీ వారినీ వదలడంలేదు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం మల్లయ్యగారిపల్లికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త ఆ పార్టీ నాయకుల అవినీతిపై సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్‌లు పెట్టారన్న అక్కసుతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కదిరి శాసనసభ్యుడు సిద్ధారెడ్డితోపాటు వైఎస్సార్సీపీ నాయకులను కించపరుస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్‌లు చేశారంటూ సొంత పార్టీ కార్యకర్త కదిరి మండలం మల్లయ్యగారిపల్లికి చెందిన మధుసూదన్‌రెడ్డిపై గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ నాయకుడు మధుకర్‌రెడ్డి, మరి కొందరు పోలీసులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
మల్లయ్యగారిపల్లికి మధుసూదన్‌రెడ్డి ఇటీవల ఎమ్మెల్యే అవినీతిపై సామాజిక మాధ్యమాల్లో వివిధ రకాల పోస్టులు పెట్టారు. ఈ విషయమై వైఎస్సార్సీపీ నాయకుడు మధుకర్‌రెడ్డితోపాటు ఆ పార్టీ ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు మధుసూదన్ రెడ్డిని ప్రశ్నించారు. ఎమ్మెల్యేపై ఎందుకు పోస్టింగ్‌లు పెడుతున్నావని అడిగారు. అడగడానికి మీరెవరంటూ మధుసూదన్ రెడ్డి తమపై దాడికి యత్నించారని.. కులం పేరుతో తిట్టారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వైఎస్సార్సీపీ నాయకుల ఫిర్యాదు విషయాన్ని కదిరి డీఎస్పీ భవ్యకిషోర్ దృష్టికి తీసుకెళ్లగా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని, దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేయడం సరికాదని డీఎస్పీ అన్నారు.
ఇవీ చదవండి: