YS Sharmila Districts Tour: అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు భరోసా కల్పించేందుకు వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మూడు రోజుల పాటు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 29న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ, డోర్నకల్.. 30వ తేదీన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైరా, ఇల్లందు, మధిర.. మే 1వ తేదీన పాలేరులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆ జిల్లాల్లో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి.. నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని షర్మిల భరోసా కల్పించనున్నారు.
జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేస్తూ.. షర్మిల రైతుల బాధలను తెలుసుకోనున్నారు. ఆ తర్వాత పాలేరులో నిర్వహించే పార్టీ కార్యక్రమంలో, మే డే వేడుకల్లో ఆమె పాల్గొననున్నారు. శనివారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ నుంచి ఆమె ఉమ్మడి వరంగల్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. వడగండ్ల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు భరోసా కల్పించనున్నారు.
కేసీఆర్‌కు రాజకీయాలపై ఉన్న ప్రేమ.. రైతులపై లేదు: గత నెలలో మూడు జిల్లాలు పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ నష్టపోయిన పంటలకు రూ.10 వేలు పరిహారాన్ని చెల్లిస్తానని చెప్పి ఇప్పటి వరకు ఏ ఒక్క రైతుకూ ఆ డబ్బులు ఇవ్వలేదని షర్మిల మండిపడ్డారు. ఇదేనా కిసాన్ సర్కార్ అంటే అని నిలదీశారు. కేసీఆర్‌కు రాజకీయాలపై ఉన్న ప్రేమ.. రైతుల మీద లేదని ఆక్షేపించారు. ఆయనకు రైతులపై ఆప్యాయత ఉంటే ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదన్నారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరిగిపోయాయని ఆరోపించారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో వంద సీట్లు అంటున్న కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆమె వెల్లడించారు. రాష్ట్ర ప్రజానీకం నుంచి వైఎస్సార్‌టీపీకి వస్తున్న ఆదరణ చూసి సీఎం కేసీఆర్ భయపడుతున్నారని ధ్వజమెత్తారు.
దళితబంధులో అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేల పేర్లు చెప్పాలి:ఈ క్రమంలోనే దళితబంధులో ఒక్కో కుటుంబం వద్ద రూ.3 లక్షలు తిన్న ఎమ్మెల్యేల పేర్లను బయటపెట్టాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ వెంటనే ఆ ఎమ్మెల్యేలను బర్తరఫ్ చేయాలన్నారు. ఆ ఎమ్మెల్యేల పేర్లను బయటపెడితే కాళేశ్వరంలో మీరు తిన్న రూ.70 వేల కోట్లు, కవిత లిక్కర్ స్కామ్, కుమారుడి రియల్ ఎస్టేట్ స్కామ్‌పై వారు ప్రశ్నిస్తారని భయమా అని నిలదీశారు.
ఇవీ చదవండి: