YS Sharmila on Medigadda Barrage Issue : మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ కాక రేపుతోంది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల నేతలు ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇందుకు పూర్తి బాధ్యత వహించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తాజాగా వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ విషయంపై స్పందించారు. ఘటనపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కేంద్రానికి ఇచ్చిన నివేదికలో 20 అంశాల మీద సమాచారం అడిగితే.. కేసీఆర్ సర్కార్ 11 అంశాలపై మాత్రమే సమాచారం ఇచ్చిందని షర్మిల ఆరోపించారు. ప్లానింగ్, డిజైనింగ్‌లో లోపాలు ఉన్నాయని నివేదికలో కమిటీ.. స్పష్టం చేసిందన్నారు. ఈ బ్యారేజీ కట్టడం అనవసరం, నిరూపయోగమని తేల్చిందని మండిపడ్డారు.
నివేదికలు చూడకుండానే మాపై నిందలా? జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌కు రాష్ట్రప్రభుత్వం లేఖ
YS Sharmila on Kaleshwaram Controversy :ప్రస్తుతం బ్యారేజీలో నీరు నింపే అవకాశం లేదని షర్మిల తెలిపారు. భవిష్యత్తులో అన్నారం, సుందిళ్లకూ ఇదే పరిస్థితి వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కమీషన్ల కోసమే కట్టిన ప్రాజెక్ట్ కాళేశ్వరమని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రాజెక్టు విలువను కావాలనే పెంచారని.. రూ.లక్ష కోట్లు కేంద్ర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కాళేశ్వరానికి తీసుకున్నారని చెప్పారు. కాళేశ్వరం పేరుతో రూ.లక్ష కోట్లు స్వాహా చేశారని ఆరోపించారు. ఇంత జరుగుతుంటే కేంద్రం ఏం చేస్తుందని.. ఎందుకు ఎంక్వైరీ కమిటీ వేయట్లేదని ప్రశ్నించారు.
కమీషన్ల కోసమే కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం. ప్రాజెక్టు విలువను కావాలనే పెంచి.. రూ.లక్ష కోట్లు స్వాహా చేశారు. కాళేశ్వరం అవినీతి గురించి మాట్లాడిన ఒకే ఒక్క పార్టీ వైఎస్ఆర్టీపీ. ఆరోజు మమ్మల్ని తప్పుబట్టిన వారు.. ఇప్పుడేం మాట్లాడతారు. ఇంత జరుగుతుంటే కేంద్రం ఏం చేస్తోంది. ఎందుకు ఎంక్వైరీ కమిటీ వేయట్లేదు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒకటే. ఆ రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉంది. స్వార్థ రాజకీయాల కోసమే కాళేశ్వరం ఘటనపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. - వైఎస్షర్మిల, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు