తెలంగాణ

telangana

ETV Bharat / state

బైక్‌ రేసులతో వాహనదారుల బెంబేలు.. కత్తితో దాడి? - తెలంగాణ వార్తలు

హైదరాబాద్​లో కుర్రకారు వాహనాలతో విన్యాసాలు చేస్తూ స్థానికంగా కలకలం సృష్టించారు. ఒక్కసారిగా బైకులు, కార్లు దూసుకురావడంతో వాహనదారులు బెంబేలెత్తిపోయారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియోలు, ఫొటోల సాయంతో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ విన్యాసాల్లో భాగంగా పలువురు యువకుల మధ్య ఘర్షణ జరిగిందని పేర్కొన్నారు.

bike races in hyderabad, youth bike races
బైక్​ రేసుతో బెంబేలు, యువత బైకు రేసులు

By

Published : Apr 26, 2021, 11:42 AM IST

కుర్రకారు వాహనాలతో విన్యాసాలు చేస్తూ హల్‌చల్‌ చేశారు. ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు బైకులు, కార్లతో చేసిన విన్యాసాల కారణంగా ఆ మార్గంలో రాకపోకలు సాగించిన వాహనదారులు బెంబేలెత్తిపోయారు. సామాజిక మాధ్యమాల్లో వీడియోలు, ఫొటోలు వైరల్‌ కావడంతో సైదాబాద్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అక్బర్‌బాగ్‌ డివిజన్‌లోని చంచల్‌గూడ ముద్రణాలయం ప్రధాన రహదారిపై సుమారు 30 నుంచి 40 బైకులు, కార్లు చాదర్‌ఘాట్‌లోని ఓ హోటల్‌ వద్ద నుంచి ఒక్కసారిగి దూసుకొచ్చాయి. కొందరు వీటిపై విన్యాసాలు చేస్తూ హల్‌చల్‌ చేశారు.

కార్లతోనూ విన్యాసాలు చేస్తుండగా అదుపుతప్పి ఓ వాహనాన్ని ఢీకొట్టడంతో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయని సమాచారం. ఈ రేసింగ్‌ విషయంలో చోటుచేసుకున్న వివాదంతో కొందరు కత్తులతో ముగ్గురు యువకులపై దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావం జరిగిందంటూ ప్రచారం జరిగింది. గాయపడిన యువకులను సైదాబాద్‌ ధోబీఘాట్‌ సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారని సమాచారం. ప్రతి ఆదివారం ఈ తరహాలోనే విన్యాసాలు జరుగుతున్నాయని వినికిడి.

చాదర్‌ఘాట్‌ నుంచి ప్రారంభమయ్యే వాహనాలతో విన్యాసాలు నల్గొండ చౌరస్తా, సైదాబాద్‌, ఆస్మాన్‌గఢ్‌, కుర్మగూడ, డబీర్‌పురా, యాకుత్‌పురాలోని పలు ప్రాంతాల మీదుగా టోలిచౌకి పరిసరాల్లోకి వెళ్లి చాదర్‌ఘాట్‌కు చేరుతున్నాయి. ఇంత జరుగుతున్నా ఆ సమయంలో సైదాబాద్‌ ఠాణా పెట్రోకారు, బ్లూకోల్ట్స్‌ పోలీసులు దరిదాపుల్లో కూడా కనిపించలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

షాబాద్‌లో నలుగురు యువకుల అరెస్టు

నిబంధనలకు విరుద్ధంగా అతివేగంతో బైకులు నడుపుతూ, శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఆదివారం షాబాద్‌లో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్‌ ప్రాంతానికి చెందిన నిఖిల్‌(24), హరీశ్‌(22), హేమంత్‌(25), రఘు(23) గచ్చిబౌలి నుంచి శంకర్‌పల్లి, షాబాద్‌ మీదుగా షాద్‌నగర్‌ వైపు రేసింగ్‌ బైక్‌లపై దూసుకెళుతున్నారు. వారు రేసింగ్‌లకు పాల్పడుతున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ క్రమంలో వారిని అదుపులోకి తీసుకోవడంతో పాటు సంబంధిత వాహనాలను స్వాధీనం చేసుకొని రాజేంద్రనగర్‌ ట్రాఫిక్‌ పోలీసులకు అప్పజెప్పారు. అనంతరం నలుగురు యువకులపై అక్కడి ట్రాఫిక్‌ పోలీసులు కేసులు నమోదు చేసి చలానాలు విధించినట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

ఇదీ చదవండి:కరోనా ఆంక్షలు బేఖాతరు- యువకులతో కప్పగంతులు

ABOUT THE AUTHOR

...view details