తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా లేదని చెప్పినా వైద్యం చేయలేదు.. చివరికి... - ఏపీలో వైద్యం అందక యువకుడి మృతి

ఆపదలో ఉన్నవారిని చూసినప్పుడు మేల్కొనే మానవత్వాన్నీ... కరోనా ఏమారుస్తోంది. మహమ్మారిపై నానాటికీ పెరుగుతున్న భయం అమాయకుల ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తోంది. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వారికి వైద్యం చేసేందుకూ ఆసుపత్రులు ముందుకురాని పరిస్థితి నెలకొంటోంది. ఏపీలో పురుగుల మందు తాగిన ఓ యువకుడు వైద్యం కోసం పలు ఆసుపత్రులు తిరిగి చివరకు కనుమూయడం కన్నీరు తెప్పిస్తోంది.

young man died in gunturu
ఏపీ: ఆసుపత్రుల చుట్టూ తిరిగి తిరిగి అలసి'పోయిన' ప్రాణం

By

Published : Jul 5, 2020, 9:36 AM IST

ఆ యువకుడిది ఏపీలోని గుంటూరు జిల్లా రేవేంద్రపాడు. వయసు 22 ఏళ్లు. ఏం కష్టమొచ్చిందో ఏమో ప్రాణాలు తీసుకోవాలని 9 రోజుల కిందట కలుపు నివారణ మందు తాగాడు. అతడిని ఎలాగైనా బతికించుకోవాలని కుటుంబ సభ్యులు మంగళగిరి సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి సిబ్బంది చికిత్స చేశారు. కరోనా అనుమానంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు.

దారిలో మరో ఆసుపత్రిలో చూపించేందుకు ప్రయత్నించగా వారు చేర్చుకోలేదు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాక... మీరు గుంటూరు జిల్లా వాసులు కాబట్టి అక్కడి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలన్నారు. వెనక్కి వెళ్తే ఆలస్యమవుతుందని.. మరో ప్రైవేటు ఆసుపత్రిలో ప్రయత్నించగా నిరాకరణే ఎదురైంది. చివరకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ యువకుడికి కరోనా పరీక్షలు చేశారు. రెండురోజుల తర్వాత వచ్చిన ఫలితాల్లో వైరస్‌ సోకలేదని తేలింది.

గుంటూరు ఆసుపత్రిలో కరోనా బాధితులు ఎక్కువగా ఉండటం వల్ల సరైన చికిత్స అందదనే ఆలోచనతో కుటుంబ సభ్యులు.. యువకుడని తెనాలిలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొచ్చారు. కరోనా లేదని గుంటూరులో ఇచ్చిన ధ్రువపత్రాన్ని చూపారు. అయినా చేర్చుకోవడానికి వారు నిరాకరించారు.

ఈ క్రమంలో వారు మళ్లీ మొదట తీసుకెళ్లిన మంగళగిరి సమీపంలోని ఆసుపత్రికి వెళ్లారు. కరోనా లేదని చెప్పినా అక్కడా చేర్చుకోలేదు. మంగళగిరిలోనే మరో ప్రైవేటు ఆసుపత్రి వారు యువకుడిని చేర్చుకుని ఐసీయూలో ఉంచారు. అప్పటికే రెండు రోజులు గడవడం వల్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం యువకుడు మృతి చెందారు.

ఇవీ చూడండి:కరోనా కాటు: తెలంగాణలో నెలరోజుల్లోనే 8 రెట్లు... 8 రోజుల్లోనే డబుల్!

ABOUT THE AUTHOR

...view details