తెలంగాణ

telangana

ETV Bharat / state

E-Vote App: పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా ఇంటి వద్ద నుంచే ఓటేయొచ్చు! - Telangana news

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇంటి నుంచే ఓటువేసే ఈ-ఓటింగ్ (E-Vote App) విధానం అందుబాటులోకి రాబోతుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం, ఐటీ శాఖ, కేంద్రం పరిధిలోని ఐటీ విభాగం సీడాక్(Cedac), ఐఐటీ ప్రొఫెసర్లు సంయుక్తంగా ఈ-ఓటింగ్ యాప్‌ను తయారు చేశారు. వివిధ ప్రయోగాలు, పరిశీలన తర్వాత తుదిరూపు ఇచ్చారు. ఈ విధానం అందుబాటులోకి వస్తే సుదూర ప్రాంతాల్లో ఉంటున్నవారు... ఓటు హక్కు వినియోగించుకునే వెసులుబాటు కలుగుతుంది. ఆ విధానం వల్ల కొవిడ్ తీవ్రత ఉన్న ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు వీలవుతుంది.

E-Vote App
ఈ-ఓటింగ్

By

Published : Oct 1, 2021, 5:10 AM IST

పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా ఇంటి వద్ద నుంచే ఓటేయొచ్చు!

బ్లాక్‌చైన్ టెక్నాలజీ, కృత్రిమ మేధల వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ యాప్ (E-Vote App) రూపొందించారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్ద నుంచే ఓటు వేసేలా యాప్ రూపకల్పన చేశారు. యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని అదే యాప్‌తో ఓటుహక్కు వినియోగించుకోవచ్చు. తద్వారా దేశంలో ఎక్కడ ఉన్నవారైనా ఎక్కడ నుంచైనా ఓటువేయడానికి అవకాశం కలగనుంది. ప్రధానంగా సైనికులు, వేర్వేరు ప్రాంతాల్లో విధులు నిర్వహించేవారు.. పోలింగ్‌ కేంద్రాలకు రాలేని వృద్ధులు, దివ్యాంగులు సహా ఆసక్తి ఉన్న ఇతరులు ఈ-ఓటు విధానంలో ఓటు వేసేందుకు అవకాశం ఉంటుంది.

ప్రస్తుత విధానంలో ప్రతిఒక్కరూ పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటువేయడం.. ఎన్నికల విధుల్లో ఉన్నవారికి పోస్టల్ బ్యాలెట్ విధానం అమల్లో ఉంది. ఆ రెండింటికి భిన్నంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానం రూపొందించారు. అందుకోసం ప్రత్యేక యాప్‌కు రూపకల్పన చేశారు. ఓటర్లు సులభంగా ఉపయోగించుకునేలా తయారు చేశారు.

రెండు ప్రక్రియల్లో...

ఓటు యాప్ (Vote App) ద్వారా రెండు ప్రక్రియల్లో ఓటింగ్ ముగుస్తుంది. మొదట రిజిస్ట్రేషన్, రెండోది ఓటు వేయడం. ఈ విధానం ద్వారా ఓటు వేయాలనుకున్న వారు ముందుగా మొబైల్‌ యాప్‌ డౌన్‌లోడ్ చేసుకోవాలి. అనంతరం ఓటరు గుర్తింపు కార్డు నెంబరు, ఆధార్ వివరాలు నమోదు చేయాలి. అదే మొబైల్ ద్వారా లైవ్‌ఫొటో తీసుకొని ఆప్‌లోడ్ చేయాలి. ఓటరు గుర్తింపు కార్డులోని ఫొటోతో తాజాఫొటోను పరిశీలించి యాప్ నిర్ధారించుకుంటుంది. ఫొటోలను ఇమేజ్ ప్రాసెసింగ్ టెక్నాలజీతో సరిపోలుస్తారు. అన్ని సక్రమమని నిర్ధరణకు ముందు ఓటీటీ (OTP) ధ్రువీకరణ ఉంటుంది. అన్ని అయిపోతే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.

యాప్‌ ద్వారా ఓటుహక్కు...

సాధారణంగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియకు అవకాశం ఉంటుంది. ఈ-రిజిస్ట్రేషన్ (E-Registration) చేసుకున్న వారు పోలింగ్ రోజు యాప్‌ ద్వారా ఓటుహక్కు వినియోగించుకోవచ్చు. ఓటింగ్‌కు ముందు రిజిస్ట్రేషన్ వివరాలు నమోదు చేయాలి. రిజిస్ట్రేషన్ సమయంలో తీసుకున్న ఫొటో ఓటు వేసేందుకు ముందు తీసుకున్న ఫొటోలు సరిపోల్చుకొని అదే వ్యక్తి అని నిర్ధరణ అయితే బ్యాలెట్ పేపర్ డిస్‌ప్లే అవుతుంది. అప్పుడు ఓటు వేయాల్సి ఉంటుంది. ఓటు వేసిన తర్వాత ఓటరు ఎవరికి ఓటు వేశారు అనేది వీవీప్యాట్ (Vvpat) తరహాలో స్క్రీపై డిస్‌ప్లే అవుతుంది. దాంతో ఓటింగ్ ప్రక్రియ ముగుస్తుంది. ఎక్కడా మనుషుల ప్రమేయం లేకుండా అంతా సాంకేతికతతోనే ఆ ప్రక్రియ పూర్తవుతుందని. ఈ-ఓటు (E-Vote) విధానంలో వచ్చిన ఓట్లను లెక్కింపుకు ప్రత్యేక విధానం అనుసరిస్తారు.

పోలింగ్ కేంద్రానికి వెళ్లడం కుదరదు...

ఈ-ఓటింగ్ (E-Vote) కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయటం కుదరదు. లైవ్ ఫొటోతో నిర్ధరణ అయితేనే ఓటువేసేందుకు అవకాశం ఉంటుంది. ఒక మొబైల్ ఫోన్ ద్వారా ఇద్దరు కుటుంబ సభ్యులు మాత్రమే ఓటు వేసేందుకు అవకాశం ఉంటుంది. రిజిస్ట్రేషన్, ఓటింగ్‌కు ఒకేఫోన్‌ నెంబరు, ఒకే మొబైల్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఒకరికి బదులు మరొకరు ఓటువేయటం సాధ్యంకాదు. రాష్ట్ర ఎన్నికల సంఘం, ఐటీ శాఖ కలిసి రూపొందించిన ఈ-ఓటు యాప్‌పై వివిధ రాష్ట్రాలు ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. అనేక భద్రతా అంశాలను పరిగణనలోని తీసుకుని ఈ- యాప్‌ రూపొందించారు. తొలుత కొన్నిచోట్ల ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తారు. అంతకముందే రాజకీయపార్టీలకు ఈ- యాప్ (E-App) గురించి వివరించి అభిప్రాయాలను తెలుసుకుంటారు.

ఓటింగ్ విధానం

ఇదీ చదవండి:Ramoji film city : రామోజీ ఫిలింసిటీకి పర్యాటక పురస్కారం

ABOUT THE AUTHOR

...view details