YCP Attacks on TDP Leaders In Macherla: ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డికి పట్టణంలో ఇల్లు అద్దెకు ఇవ్వకుండా అడ్డుకునే దుస్థితికి మాచర్ల రాజకీయం దిగజారింది. ప్రతిపక్షపార్టీ నేతలకు ఏవిధంగానైనా నియోజకవర్గానికి చెందినవారు సహకరిస్తే వారిని గుర్తించి వెంటాడి వివిధ రకాలుగా వేధించి అటువైపు ఎవరూ వెళ్లకుండా చూడాలన్న ప్రయత్నాలు ఫలించకపోవడంతో వారి ఆగ్రహం పరాకాష్ఠకు చేరింది. ప్రతిపక్షపార్టీలకు లభిస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక దాడులకు తెగబడుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2019లో వైసీపీ అధికారం చేపట్టగానే అరాచక పర్వానికి తెరలేచింది.
దుర్గి మండలం ఆత్మకూరు, జంగమహేశ్వరపాడు గ్రామాల్లో టీడీపీకు ఓటేశారన్న కక్షతో వారిని గ్రామ బహిష్కరణ చేశారు. టీడీపీ బాధితులకు శిబిరం నిర్వహించి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో చలో ఆత్మకూరుకు పిలుపునిచ్చారు. ఈక్రమంలో అధికారులు జోక్యం చేసుకుని ప్రత్యేక వాహనాల్లో కొన్ని కుటుంబాలను సొంత గ్రామాలకు తరలించారు. ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన నివాసం నుంచీ బయటకు రాకుండా గేట్లకు తాళ్ళు కట్టి మరీ నిర్బంధించారు.
జంగమహేశ్వరపాడులో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా టీడీపీ వారిపై వైసీపీ వారు దాడిచేసి గ్రామం నుంచి కొన్ని కుటుంబాలు వెళ్లిపోయేలా చేశారు. 2019 నుంచి శుక్రవారం రాత్రి దాడుల వరకు ఆరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. 2020 సంవత్సరంలో వెల్దుర్తి మండలంలోని బోదిలవీడు ఎంపీటీసీ స్థానానికి టీడీపీ తరఫున మహిళా అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు ప్రయత్నించింది. వైసీపీ నాయకులు ఆమె నామినేషన్ పత్రాలు చింపేశారు.
రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం: దీంతో చంద్రబాబునాయుడు ఆదేశాలతో టీడీపీ నాయకులు బొండా ఉమా, బుద్దా వెంకన్న, న్యాయవాదులతో కలిసి వెల్దుర్తికి బయలుదేరారు. ఈ సందర్భంగా మాచర్ల పట్టణంలోకి ప్రవేశించిన బొండా ఉమా, బుద్దా వెంకన్న వాహనంపై అప్పటి వైసీపీ పట్టణ యువజన అధ్యక్షుడు తురక కిషోర్ అనుచరులతో దాడిచేశారు. ఇది అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ దాడి తరువాత కిషోర్‌ను పురపాలకసంఘం ఛైర్మన్ చేయడం విశేషం. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి పురోగతి లేదని చెప్పుకోవాలి.
2022 జనవరిలో వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామ టీడీపీ నేత చంద్రయ్యను నడిరోడ్డుపై పట్టపగలే వైసీపీ నాయకులు గొంతు కోసి హత్యచేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కల్గించింది. టీడీపీ అధినేత చంద్రబాబు గుండ్లపాడు వచ్చి హంతకులు అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ హత్యలో ప్రధాన నిందితుడిగా ఉన్న అదే గ్రామానికి చెందిన శివరామయ్యతో పాటు, మరికొందరు నిందితులు కొన్ని రోజులు జైలుకు వెళ్లి, బెయిల్‌పై బయటకు వచ్చారు.
శివరామయ్య వెల్దుర్తి ఎంపీపీగా ఉండి ఈ హత్యలో ప్రధాన నిందితుడిగా ఉండటం గమనార్హం. వైసీపీ దాడుల నేపథ్యంలో టీడీపీకు చెందిన కొన్ని కుటుంబాలు గ్రామం విడిచిపెట్టి వెళ్లారు. వైసీపీ దాడిలో హత్యకు గురయిన కుటుంబ సభ్యుల మీదనే పోలీసులు అక్రమ కేసులు బనాయించడం గమనార్హం.
పోలీసులు చూసీ చూడనట్లు వదిలేయడం: 2022 జూన్ నెలలో దుర్గి మండలం జంగమహేశ్వరపాడులో టీడీపీ నాయకుడు జల్లయ్యను అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు దారి కాచి హత్యచేశారు. పాతకక్ష్యల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులోను నిందితులు కొన్ని రోజులు జైలుకెళ్లి బయటకు వచ్చారు. ప్రస్తుతం ఈ గ్రామంలో టీడీపీకి చెందిన చాలా కుటుంబాలు గ్రామం విడిచిపెట్టి వెళ్లిపోయారు. దాడుల్లో నిందితులకు పదవులు ఇస్తుండటం, పోలీసులు చూసీ చూడనట్లు వదిలేయడంతో ఆరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. టీడీపీ వారిపై దాడిచేస్తే గుర్తింపు వస్తుందన్న పరిస్థితికి కొందరు రావడం గమనార్హం.