Telangana Secretariat Worship Places :తెలంగాణపాత సచివాలయ ప్రాంగణాల్లో ఉన్న ప్రార్థనా మందిరాలను రాష్ట్ర ప్రభుత్వం పునః నిర్మించింది. గతంలో ఆ ప్రాంగణంలో నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయం, రెండు మసీదులు, చర్చ్ (church) ఉండేవి. పాత బిల్డింగ్ కూల్చివేతల సమయంలో ప్రార్థనా మందిరాలకు (Worship Places) నష్టం జరగడంతో ప్రభుత్వ ఖర్చుతోనే వాటిని పునర్నిర్మిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అందుకు అనుగుణంగా సచివాలయ ప్రధాన భవన ప్రాంగణం వెలుపల వాటిని నిర్మించారు.
Nallapochamma Temple in Telangana Secretariat :ఈ నెల 25న సచివాలయ ప్రార్థనా మందిరాల ప్రారంభోత్సవం జరగనుంది. సచివాలయానికి నైరుతి మూలన నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయాన్ని విశాలంగా నిర్మించారు. ప్రధాన ఆలయంలో భాగంగా గర్భగుడి, మహా మండపం నిర్మించారు. నల్లపోచమ్మ ఆలయంతో పాటు శివాలయం, ఆంజనేయ స్వామి ఆలయం, గణపతి ఆలయం, సుబ్రహ్మణ్యస్వామి ఆలయ నిర్మాణం కూడా జరిగింది. పాత సచివాలయ ప్రాంగణం (Telangana Secretariat premises) దేవాలయంలో ఉన్న నల్ల పోచమ్మ అమ్మవారి విగ్రహాన్ని చిక్కడపల్లిలోని ఓ ఆలయంలో ఉంచి ఇంతవరకు పూజలు నిర్వహిస్తున్నారు.
ప్రారంభోత్సవ సమయానికి కొత్త ఆలయంలోకి తీసుకొచ్చి పునః ప్రతిష్ఠ చేస్తారు. ఇతర ఆలయాల విగ్రహాలను తిరుపతిలో తయారు చేయించారు. హిందూ సాంప్రదాయాలను అనుసరించి పూజారుల సమక్షంలో 25న నల్లపోచమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన చేసి దేవాలయాన్ని సీఎం కేసీఆర్ పునఃప్రారంభిస్తారు. గతంలో ఉన్న స్థలంలోనే రెండు మసీదులను నిర్మించారు. మసీద్- ఏ - మోతెమది, మసీద్ - ఏ - హాష్మితో పాటు ఇమామ్ నివాసాన్ని నిర్మించారు.
Mosque in Telangana secretariat premises :మసీదులు, ఇమామ్ నివాసం సచివాలయానికి పశ్చిమ భాగాన ఉన్నాయి. మసీదుల సమీపంలోనే చర్చ్‌ను నిర్మించారు. తెలంగాణ సచివాలయ ఉద్యోగుల చర్చ్ నిర్మాణం కూడా పూర్తయింది. ఈ నెల 25వ తేదీనే మసీదులు, చర్చ్ ప్రారంభోత్సవం కూడా జరగనుంది. ఇస్లాం, క్రిస్టియన్ మతాల సాంప్రదాయాలను అనుసరించి ఆయా మత పెద్దల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్(CM KCR) ప్రారంభిస్తారు. ప్రార్థనా మందిరాలకు నిర్వహణా కార్యవర్గాలు కూడా ఏర్పాటయ్యాయి.