- అసలు ఆర్థరైటిస్ అంటే ఏమిటి? ఈ సమస్య ఎక్కువ అవ్వడానికి గల కారణాలు ఏమిటి?
కీళ్లు అరిగిపోవటాన్ని ఆర్థరైటిస్ అంటారు. సహజంగా ఇది వయసుతో పాటు వచ్చే సమస్య. బండి టైర్, వాడే చెప్పులు ఎలా అరిగిపోతాయే అలాగే జాయింట్లు కూడా అరిగిపోతాయి. మనుషుల్లో చూసుకుంటే శరీరం మొత్తం బరువు మోకాళ్ల మీదనే పడుతుంది. అందుచేత మోకాళ్లు ఎక్కువగా ఆరిగిపోతుంటాయి. దీనినే 'ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ నీ జాయింట్' అంటాం. వయసు రిత్యా వస్తుంది. అస్టియో ఆర్థరైటిస్‌తో పాటు, రుమటాయిడ్, సెప్టిక్, గౌట్ ఆర్థరైటిస్ వంటి రకాలు ఉన్నాయి. చిన్న వయసులో జాయింట్స్ దగ్గర తగిలే దెబ్బల వల్ల కూడా ఆర్థరైటిస్ వస్తుంది.
- ఇది వయసుతోపాటు వచ్చే సమస్యే అంటున్నారు. అయితే ఇటీవలి కాలంలో యుక్త వయసు వారిలోనూ ఈ సమస్య కనిపిస్తుంది. దీనికి కారణం ఏంటి?
చాలా మంది చిన్నవాళ్లలో ఇది వస్తుంది. ఇది మానవ తప్పిదం వల్ల వచ్చే సమస్య. ఊబకాయం, సరైన శారీరక శ్రమ లేకపోటవం, లేక అతిగా జుంబా, స్టెప్పర్, ఎయిరోబిక్స్, జాగింగ్ లాంటివి చేయడం, సరైన జాగ్రత్తలు తీసుకోకుండా కొన్ని రకాల ఆటలు ఆడటం, భారీ వాహనాలను నడపటం, ఒకేచోట కదలకుండా కూర్చోవటం, విటమిన్ డీ లోపం వల్ల కూడా ఆర్థరైటిస్ వస్తుంది.
- మీరన్నట్టు ఊబకాయం లాంటి సమస్యని మినహా ఇస్తే... క్రీడలు, ఎక్సర్సైజ్లు వంటివి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవటానికి చేస్తుంటాం. అయితే వాటివల్ల కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరి ఈ సమస్యని ఎలా అధిగమించవచ్చు?
నేను త్రెడ్ మిల్, స్పోర్ట్స్, ఎక్సర్‌సైజ్‌కి వ్యతిరేకం కాదు. కానీ ఒక స్థాయి దాటి ఏదైనా చేయటం మంచిది కాదు. త్రేడ్మిల్ 5 స్పీడ్ మీద చేయవచ్చు. వారంలో ఐదు రోజులు బ్రిస్క్‌వాక్ సరిపోతుంది. ఎయిరో బిక్స్ లాంటివి మనకు అవసరం లేదు. అవి వెస్ట్రన్ సంస్కృతి... అక్కడి వారికి అవసరం. ఫిట్‌గా ఉంటాం కదా అని తరచూ మెట్లు ఎక్కుతుంటారు... అయితే ఊబకాయం ఉన్నవారు మెట్లు వాడకపోవటం మంచిది. ఇండియన్ టాయిలెట్స్ వాడకపోవటం, పద్మాసనంలో కూర్చోకపోవటం మంచిది. ఆర్థరైటిస్ ఏదో ఒక వయసులో వస్తుంది. అయితే ఇలాంటి జాగ్రత్తల వల్ల ఆర్థరైటిస్‌ని కొంతకాలం పోస్ట్‌పోన్ చేయవచ్చు.
- ఒకే చోట స్థిరంగా కూర్చుంటే ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. అయితే ప్రస్తుతం ఉద్యోగస్తుల్లో దాదాపు 80శాతం డెస్క్ జాబులే. మరి అలాంటి వారిలో ఆర్థరైటిస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు?
డెస్క్ జాబ్ వాళ్లకి ఆర్థరైటిస్ వస్తుందని కాదు కానీ... అలాంటి వారిలో ఊబకాయం పెరుగుతుంది. ఇలాంటి వారు 50 నిమిషాలకు ఒకసారి 5 నిమిషాలు బ్రేక్ తీసుకుని.. ఛైర్ లోంచి లేచి వాకింగ్ చేయటం, మెటికలు విరవటం, లెగ్ ఎక్సర్సైజ్లు చేయటం వంటివి మంచిది.
- ప్రాణాపాయ వ్యాధులకు ఇచ్చే అంత ప్రాముఖ్యత ఎముకల సంబంధిత వ్యాధులకు ఇవ్వటం లేదు. అయితే ప్రాథమిక దశలో ఈ ఆర్థరైటిస్‌ని గుర్తించటం ఎలా?