ప్రాజెక్టులతో చెరువుల అనుసంధానంపై హైదరాబాద్ జలసౌధలో రాష్ట్రస్థాయి వర్క్‌షాప్ నిర్వహించారు. నీటిపారుదలకు సంబంధించి వారం రోజుల్లో నివేదిక రూపొందించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. మిషన్ కాకతీయ లక్ష్యం నెరవేరాలంటే చెరువుల్లో కనీసం పది నెలల పాటు నీరు నిల్వ ఉంచి... రెండు పంటలకు నీరివ్వాలని సీఎం ఓఎస్డీ దేశ్‌పాండే తెలిపారు. చెరువులను ప్రాజెక్టులతో అనుసంధానం చేసినప్పుడే ఇది సాధ్యమని ముఖ్యమంత్రి భావిస్తున్నారని చెప్పారు.
జలసౌధలో వర్క్‌షాప్ - kcr
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ జలసౌధలో ప్రాజెక్టులతో చెరువుల అనుసంధానం.. తదితర అంశాలపై వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఓఎస్డీ దేశ్‌పాండే, చిన్ననీటి పారుదల శాఖ సలహాదారు విజయ్ ప్రకాశ్ పాల్గొన్నారు.
వచ్చే జూన్‌లో కాళేశ్వరం సహా ఇతర ప్రాజెక్టుల నుంచి నీరు అందుతుందని... వాటిని చెరువులకు అనుసంధానం చేయడం ద్వారా రెండు పంటలకు నీరిచ్చే స్థితి వస్తుందని ఓఎస్డీ తెలిపారు. వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు చెక్ డ్యాంల నిర్మాణాన్ని చేపట్టాలని సీఎం ఆదేశించారన్నారు. ఈ పనులన్నీ మిషన్ కాకతీయ తరహాలో యుద్ధ ప్రాతిపదికన జరగాలన్నారు.
రాష్ట్రంలోని 48వేల 845 చెరువుల్లో 27వేల 814 చెరువులు, కుంటలు 12వేల 154 గొలుసుల కింద ఉన్నట్లు తేలిందని చిన్న నీటిపారుదల సలహాదారు విజయ్ ప్రకాశ్ అన్నారు. చెరువులను నింపేందుకు ప్రాజెక్టుల కాల్వలకు ఎక్కడెక్కడ తూములు నిర్మించాలన్న దానిపై స్పష్టతకు రావాలని ఇంజినీర్లకు సూచించారు.
ఈ సమావేశంలో అన్ని జిల్లాల ఇంజినీర్లు, తదితరులు పాల్గొన్నారు.