హైదరాబాద్ మహానగరంలో మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసులు... ఆ దిశగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. అయినా.. ఎక్కడో ఒక చోట మహిళలు వేధింపులకు గురవుతూనే ఉన్నారు. రాత్రివేళల్లో బస్టాప్‌లు, కాలనీలలో పోకిరీల వేధింపులు ఎదురవుతున్నాయని ఫిర్యాదులు అందడం వల్ల.. వీటిని పూర్తిగా నివారించేదుకు పంజాగుట్ట పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఆకతాయిల భరతం పట్టడానికి ప్రత్యేకంగా మహిళా పోలీసు బృందాలను నియమించారు. ఠాణా పరిధిలో సుమారు 8 లక్షల మంది జనాభా నివాసం ఉంటున్నారు. రద్దీ సమయాల్లో అమీర్‌పేట, బేగంపేట, ఎర్రమంజిల్, బీయస్ మక్తా, ఎంఎస్ మక్తా, సోమాజిగూడ ప్రాంతాల్లో మహిళా కానిస్టేబుళ్లతో ప్రత్యేక గస్తీ చేయిస్తున్నారు.
బుల్లెట్ శ్యామల...
పంజాగుట్ట పోలీస్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ శ్యామల, హేమలతను ప్రత్యేక బృందాలలో నియమించారు. వీరిద్దరూ.. రోజూ ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ.. స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నిఘా పెడతారు. వీరిలో హెడ్ కానిస్టేబుల్ శ్యామల భిన్న రీతిలో బుల్లెట్ మోటారు సైకిల్‌పై గస్తీ నిర్వహించి ఆకతాయుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. బైకు నడపడంలో ఆసక్తి ఉన్న శ్యామల.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ తరహా విధులు నిర్వర్తించడం ఆనందంగా ఉందని చెబుతోంది.
ముఖ్యంగా రద్దీగా ఉండే సమయాల్లో, రాత్రి వేళల్లో మహిళలపై వేధింపులు, వ్యభిచార ముఠాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎటువంటి ఘటన జరిగినా.. వెంటనే పెట్రోలింగ్ వాహనానికి సమాచారం ఇస్తోంది. ఠాణాకు మహిళలు ఎవరైనా ఫిర్యాదు చేయడానికి వచ్చినా.. తక్షణమే వారి సమస్య తీర్చే విధంగా శ్యామల కృషి చేస్తోంది.