ఆర్థిక ఇబ్బందులు, వైవాహిక సమస్యలు... వంటివి సవాల్ విసిరినా ఆమె బెదిరిపోలేదు. తాను ఆత్మవిశ్వాసంతో అడుగులేస్తూ... ఆపన్నులకు తనవంతు సాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. మార్చలేని గతం గురించి బాధపడటం తనకు ఇష్టముండదు అంటూనే.. చేతిలో ఉన్న భవిష్యత్ కోసం శ్రమిస్తానంటోందీవిడ. తనే ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలానికి చెందిన గంగాసాగర్ బాయి.
గంగాసాగర్ బాయి నాన్న సీతారాం చిన్నప్పుడే చనిపోయారు. అమ్మ దేవాబాయి... ఇళ్లల్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేది. తన పిల్లలు తనలా కాకూడదన్నది ఆ తల్లి తపన. అందుకే గంగాబాయిని ఉట్నూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో చేర్పించిందామె. అక్కడే గంగ పదో తరగతి వరకు చదివింది. కానీ పై చదువులకు ఆర్థిక పరిస్థితులు సహకరించలేదు. దాంతో ఆమె ఇళ్లల్లో వంటపనిచేస్తూ...ఇంటర్ పూర్తిచేసింది. గంగ మొదట్నుంచీ చదువుతోపాటు క్రీడలు, సేవ, సాంస్కృతిక కార్యక్రమాలు... అన్నింటిలోనూ చురుగ్గా ఉండేది. ఆమె ప్రతిభను గుర్తించిన ఐటీడీఏ అధికారులు... స్థానికంగా ఓ పాఠశాలలో స్కౌట్స్ ఉపాధ్యాయురాలిగా నియమించారు.
పిల్లలు లేరని...
ఉద్యోగంలో స్థిరపడ్డాక గంగాబాయి పెళ్లి చేసుకుంది. జీవితం ఇకనైనా సంతోషంగా సాగిపోతుందనుకుని కలలుకంది. కానీ అలా జరగలేదు. మూడేళ్లయినా పిల్లలు కలగలేదని భర్త వేధించేవాడు. మానసికంగా చిత్ర హింసలు పెట్టేవాడు. అయినా ఓపిగ్గా భరించింది. కానీ అదే కారణం చూపించి మరో పెళ్లి చేసుకున్నాడతను. అప్పుడు గంగను ఒంటరితనం చుట్టేసింది.