తెలంగాణ

telangana

ETV Bharat / state

మానవి ఆవేదన...! - SWETCHHA

అమ్మగా, భార్యగా, కూతురిగా, సోదరిగా కర్తవ్యాన్ని పాటించటంలో తనకు తానే సాటి. కొన్ని ఇష్టాలు, ఎన్నో కష్టాలు అయినా భరించాల్సిందే. పైకి ఆనందంగా ఉన్నా....మనసులో లెక్కలేనంతా ఆవేదన. గాయపడిన కవి గుండెల్లో రాయని కావ్యాలెన్నో అన్న మాదిరిగా గాయపడిన మానవి గుండెల్లో దాచుకున్న బాధలెన్నో ...జీవిత సంఘర్షణలో నిరంతరం పోరాడే ఆ వనిత మనసులోని బాధలేంటి..? తన స్వేచ్ఛకు పడుతున్న సంకెళ్లేంటి..? మానవి ఆవేదన వెనక ఉన్న అర్థమేంటి?

మానవి ఆవేదన...!

By

Published : Mar 8, 2019, 1:09 PM IST

Updated : Mar 8, 2019, 5:54 PM IST

మానవి ఆవేదన...!
బాల్యంలో అమ్మకొంగు చాటులో పెరిగిన ఓ సాధారణ ఆడపిల్లను...సొంతంగా నిర్ణయం తీసుకోలేని మహిళను.. సమాజంలో ధైర్యంగా బయటకు రాలేని ఓ అభాగ్యురాలిని... ఎదురు మాట్లాడలేని నిశ్చేయురాలని... స్వేచ్ఛకు సంకేళ్లు వేసినా... ఏమి అనలేని ఓ సాధారణ మగువను.

అమ్మగా, భార్యగా, కూతురిగా, సోదరిగా ఇన్ని పాత్రలు పోషించే నాకు స్వేచ్ఛే లేదు. చిన్నతనమంతా నాన్న నీడలోనే. వయస్సు రాగానే పెళ్లి. భర్త అడుగుజాడల్లో ప్రయాణం. తర్వాత పిల్లలు...వాళ్ల ఆలనా పాలనా. వృద్ధాప్యంలో మళ్లీ వారసులు చెప్పినట్లే వినాలి. నాకంటూ స్వేచ్ఛ లేదా.. ! ఎవరి మీద ఆధారపడకుండా నా స్వశక్తితో బతకాలనుకుంటున్నాను.

పక్కనే ఉన్న షాపుకు వెళ్లాలంటే నా కన్న చిన్నవాడిని తోడుగా ఇచ్చి పంపుతారు. ఏదైనా చెప్పాలంటే భయం.. సొంతంగా నిర్ణయం తీసుకుంటే... నీకేం తెలుసు.. మేం చెప్పింది చేయ్ అంటారు. మీ పెంపకంలో నేను ఆలోచించడమే మర్చిపోయాను. ఇప్పుడు నేను ఏదైనా చేయాలంటే... మరొకరి మీద ఆధారపడాల్సి వస్తుంది. నాకు ఆలోచించాలనే ఆలోచనే రావడం లేదు.

పెళ్లికాగానే అత్తారింట్లో అడుగు పెట్టాను. భర్త అడుగు జాడల్లో నడవాలని అమ్మ చెప్పింది. నేను చదువుకున్న చదువుకు అర్థం లేకుండా పోయింది. ఉద్యోగం చేస్తానన్నాను. భర్త సంపాదిస్తున్నాడు కదా నీకెందుకన్నారు. అక్కడితో ఎదుగుదల ఆగిపోయింది. వంటింటికి అంకితమైపోయాను.

పిల్లలు ఎప్పుడు, ఎంత మందిని కనాలి. ఇవన్నీ మీ ఇష్టప్రకారమే. నాకిప్పుడే పిల్లలొద్దని చెప్పాలని ఉంది. కాని ఏం చేస్తాం...సమాజం సంకెళ్లతో బంధించింది. పిల్లల చదువులు వారి పెళ్లిళ్లు అన్నీ మీ నిర్ణయం ప్రకారమే జరగాలి. నేను కేవలం మీ అవసరాలు తీర్చే ఓ యంత్రమా అనిపిస్తుంది.

చరమాంకంలోనూ పిల్లలు చెప్పినట్లే చేయాలి. నేను కన్ను మూసే వరకు నాకు స్వేచ్ఛ ఉండదేమో. మాకు కావాల్సింది మహిళ దినోత్సవాలు కాదు.. స్వేచ్ఛ. మేము మేముగా బతికే స్వాతంత్య్రం.

Last Updated : Mar 8, 2019, 5:54 PM IST

ABOUT THE AUTHOR

...view details