Woman gave birth to a 5.8 kg baby boy: ప్రభుత్వాసుపత్రి అంటేనే సమస్యలకు నిలయమని భావించే ఈ రోజుల్లో ఏపీలోని అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రభుత్వాసుపత్రి అరుదైన ఘటనకు వేదికగా నిలిచింది. కర్నూలు జిల్లా హత్తిబేలాగాలుకు చెందిన తేజస్విని అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో సమీపంలోని ఆలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె స్థితిని గమనించిన వైద్యులు గుంతకల్లుకు వెళ్లాలని సూచించడంతో వారు గుంతకల్లు ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు.
అప్పటికే పురిటి నొప్పులతో బాధపడుతున్న తేజస్వినికి ప్రభుత్వాసుపత్రి వైద్యురాలు సుజాత సహజ ప్రసవం ద్వారా కాన్పు అయ్యేలా చేస్తామని.. ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. దాదాపుగా రెండు గంటల శ్రమ అనంతరం సహజ ప్రసవం అయ్యేలా చేశారు. అయితే మూడు మూడున్నర కేజీల వరకు బరువు ఉన్న శిశువు సహజ ప్రసవం అవ్వడానికి అవకాశం ఉందని.. కానీ పుట్టిన శిశువు ఏకంగా 5.8 కేజీల బరువుతో పుట్టడం.. అది కూడా సహజ ప్రసవం ద్వారా పుట్టడం అనేది అరుదుగా జరుగుతుందని తెలిపారు.