భారత్-చైనా సరిహద్దులోని గాల్వన్ లోయలో జరిగిన దుర్ఘటనలో అమరుడైన కల్నల్ సంతోశ్ బాబు భౌతికదేహం... ఆయన స్వస్థలం సూర్యాపేటకు చేరుకుంది. ఈ ఉదయం 8 గంటలకు కేసారం గ్రామ పరిధిలోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు జరగనున్నాయి. సైనిక లాంఛనాల మధ్య తుది ఘట్టం జరగనుండగా... అంతకు ముందు భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు.
జాతి యావత్తు అశ్రునివాళి
వీరుడా నీకు వందనం అంటూ... సరిహద్దుల్లో వీరమరణం పొందిన కల్నల్ సంతోశ్ బాబుకు జాతి యావత్తు అశ్రునివాళి అర్పించింది. ఆయన పార్థివదేహాన్ని బుధవారం రాత్రి హైదరాబాద్ హకీంపేటకు తీసుకువచ్చి అక్కడి నుంచి స్వస్థలం సూర్యాపేటకు తరలించారు. హకీంపేటలో ఆర్మీ అధికారులు సైనిక లాంఛనాలతో ప్రత్యేక వందనం సమర్పించారు. గవర్నర్ తమిళిసై, మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, మల్లారెడ్డి సహా ఉన్నతాధికారులు నివాళులు అర్పించారు. సంతోశ్ బాబు భార్య సంతోషి ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ప్రత్యేక కాన్వాయ్‌లో రోడ్డు మార్గంలో పార్థివదేహాన్ని సూర్యాపేటకు తరలించారు.
ఇంటి వద్ద పెద్ద ఎత్తున
కల్నల్ సంతోశ్‌బాబు పార్థివదేహం అర్ధరాత్రి సమయంలో సూర్యాపేటకు చేరుకుంది. దారంతా కొవ్వొత్తులు వెలిగించి, జాతీయ జెండాలు చేబూని ప్రజలు నీరాజనాలు పలికారు. సంతోశ్‌బాబు ఇంటి వద్ద పెద్ద ఎత్తున చేరుకున్న జనం... వీరుడికి వందనం అంటూ నినాదాలు చేశారు. సంతోశ్‌బాబు పార్థివ దేహం చూసి కుటుంబ సభ్యులు, బంధువులు ఉద్విగ్నతకు లోనయ్యారు. ఆయన జ్ఞాపకాలను తలుచుకుంటూ విలపించారు. సంతోశ్‌బాబు భౌతికదేహంపై సైనికాధికారులు జాతీయ జెండా ఉంచారు. పుష్ప గుచ్చాలతో నివాళులు అర్పించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి సహా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు శ్రద్ధాంజలి ఘటించారు.
వ్యవసాయ క్షేత్రంలో
అమర సైనికాధికారి సంతోశ్‌బాబు అంత్యక్రియలు... సూర్యాపేట సమీపంలోని కేసారంలో జరగనున్నాయి. కేసారం గ్రామ పరిధిలోని ఆయన కుటుంబానికి చెందిన వ్యవసాయ క్షేత్రంలో సైనిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. నిబంధనల మేరకు అంతిమ సంస్కారాలకు 50 మంది కుటుంబ సభ్యులను మాత్రమే అనుమతిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అంత్యక్రియలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. సైనిక ఉన్నతాధికారి సమక్షంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్ ఏర్పాట్లను పరిశీలించారు.
ఇదీ చూడండి :ప్రజల ప్రాణాలు గాలికొదిలేశారా..! కరోనా నివారణపై హైకోర్టు అసంతృప్తి..