భారత్‌లో జూన్ మొదటి వారంలో మోగాల్సిన బడి గంట...ఎప్పుడు మోగుతుందో తెలియని ఆయోమయ పరిస్థితి. ఈ పరిస్థితుల్లో కరోనాతో ఉక్కిరిబిక్కిరి అయిన కొన్ని దేశాలు విద్యా విధానాన్ని ఎలా కొనసాగిస్తున్నాయి? ఎలాంటి జాగ్రత్తలతో పాఠశాలలను తెరుస్తున్నాయి? అనే చర్చ విద్యాశాఖ వర్గాల్లో సాగుతోంది. కొన్ని దేశాలు అనుసరిస్తున్న సంస్కరణలను పరిశీలిస్తే..
జపాన్: ‘గాలి’ వేగంతో గదుల్లో మార్పులు
గాలి ధారళంగా వచ్చేలా తరగతి గదుల్లో మార్పులు చేశారు. విద్యార్థులు, సిబ్బంది సహా ఎవరూ భౌతికదూరం నిబంధనలను మీరి దగ్గరగా చేరకూడదు, సంభాషించ కూడదని నిర్దేశించారు. ‘మాస్కులు తప్పనిసరి. చేతులు తరచూ శుభ్రపరుచుకోవాలి. తరచూ విద్యార్థుల శరీర ఉష్ణోగ్రత పరీక్షించాలి. పాజిటివ్ కేసు బయటపడితే తాత్కాలికంగా తరగతి గది, అవసరమైతే పాఠశాలలను మూసివేయాలనే’ నిబంధనను అమలు చేస్తున్నారు.
వియత్నాం: రోజు మార్చి రోజు
ఇక్కడ విద్యా సంస్థలను ఫిబ్రవరిలో మూసివేసినా, మార్చి 2వ తేదీ నుంచి తెరిచారు. బడులు రోజు మార్చి రోజు నడిచాయి. తరగతి గదిలో 20 మందికి మించకూడదనే నిబంధనను అమలు చేశారు. ఆన్‌లైన్, ముఖాముఖి తరగతులతో పాఠ్య ప్రణాళిక పూర్తి చేశారు. విద్యేతర కార్యక్రమాలన్నీ రద్దు చేశారు.
హాంకాంగ్: ఒంటిపూట బడులు
హాంకాంగ్‌లో దశల వారీగా పాఠశాలలను తెరుస్తున్నారు. మే నెల 27వ తేదీ నుంచి సీనియర్ సెకండరీ విద్యార్థులకు తరగతులు మొదలయ్యాయి. మాధ్యమిక, ప్రాథమిక తరగతులను జూన్ 8న ప్రారంభిస్తారు. కిండర్‌గార్డెన్ విద్యార్థులకు ఈసారి తరగతులు జరగవు. తరగతి ఏదైనా గదుల్లో విద్యార్థులు మీటరు చొప్పున భౌతిక దూరం విధిగా పాటించాలని, ఒంటిపూట బడులే కొనసాగించాలని అక్కడి విద్యాశాఖ వర్గాలు నిర్ణయించాయి. భోజనం చేసేటప్పుడు అందరూ ఒకచోట గుమికూడకుండా ఉండేందుకే ఈ నిర్ణయమని పేర్కొన్నాయి.