అనుమతుల్లేని, అనధికార ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్దీకరణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్కు భారీగా దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. వాటిని పరిశీలించి యజమానులు రుసుము చెల్లించినతర్వాత క్రమబద్ధీకరించాలి. అయితే ఆ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. అయితే ఎల్ఆర్ఎస్ లేని వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరగకపోవడం ప్రస్తుతం ఇబ్బందికరంగా మారింది. తాజా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులతో పాటు 2015లో దరఖాస్తు చేసుకొని పరిష్కారం కాని వాటి పరిస్థితి అలానే ఉంది. కార్డు పద్ధతిలోనే వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు జరుగుతున్నప్పటికీ ఎల్ఆర్ఎస్ లేని వాటి రిజిస్ట్రేషన్లు కావడం లేదు. దీనితో ఆయా ఆస్తుల అమ్మకం, కొనుగోలుదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల ఆందోళనలు జరిగాయి. ఈ విషయం ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.
నాలుగు ఐచ్ఛికాలతో...
మరోవైపు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించి ఓ నిర్ణయం తీసుకొని ముందుకెళ్తారని చెబుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జనవరి నెలాఖరుతో క్రమబద్ధీకరణ రుసుము చెల్లింపు ప్రక్రియ పూర్తి కావాలి. కానీ... ఇప్పటికీ దరఖాస్తుల పరిష్కారమే ప్రారంభం కాలేదు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్లస్టర్లు, గ్రూపులుగా విభజించి పరిష్కరించాలని పురపాలక శాఖ కసరత్తు చేస్తోంది. ఫీర్జాదిగూడ నగరపాలికలో పైలట్ పద్ధతిన కొంత ప్రక్రియ కూడా చేశారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం కోసం నాలుగు ఐచ్ఛికాలను అధికారులు ప్రభుత్వానికి సూచించినట్లు సమాచారం. వాటిని పూర్తి స్థాయిలో పరిశీలించి ఓ నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.