ప్రజాక్షేత్రంలో పోరాడాల్సిన కాంగ్రెస్... మీడియా సమావేశాలకే పరిమితమవుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ తిరోగమనంలో పయనిస్తోందనే వాదన వినపడుతోంది. అధికార పార్టీని ఎదుర్కొనేందుకు దీటుగా ప్రజా పోరాటాలు, ఉద్యమాలు చేయాల్సిన పార్టీ మిన్నకుండిపోతోందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలకు పెద్దన్న పాత్ర పోషించాల్సిన కాంగ్రెస్ పార్టీ అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని తెలిపారు.
'అధికారం దూరమైన వైఖరి మారట్లేదు'
2018 డిసెంబర్‌లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తున్నామనే భావనను తీసుకురాగలిగినా.. చివరకు ప్రజల నుంచి ఓట్లను రాబట్టలేకపోయింది. తెరాస భారీ ఆధిక్యతం సాధించి అధికారంలోకి రాగా కాంగ్రెస్ మాత్రం 2014లో వచ్చినన్ని సీట్లు కూడా సాధించలేకపోయింది. రెండోసారి కూడా అధికారానికి దూరమైన కాంగ్రెస్ ఇప్పటికీ తన వైఖరిని మార్చుకోలేకపోయిందనేది విశ్లేషకుల వాదన.
నాయకత్వ వైఫల్యం...
రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నా.. వాటిని ప్రజాక్షేత్రంలోకి తీసుకుపోవడంలో రాష్ట్ర నాయకత్వం పూర్తిగా విఫలమైందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంటర్ ఫలితాల్లో జరిగిన తప్పిదాల కారణంగా 20 మందికిపైగా విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నా.. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న సమస్యపై ప్రధాన ప్రతిపక్షంగా క్షేత్ర స్థాయిలో పోరాటం చేయలేకపోయిందని విమర్శించారు.