తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఏ లక్షణాలుంటే కరోనా, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి..?'

ఏయే లక్షణాలుంటే..కరోనాగా భావించాలి..? ఇప్పుడిదీ అంతు పట్టటం లేదు. ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా లక్షణాలు కనిపిస్తున్నాయి. కొందరిలో సాధారణం జలుబు, దగ్గు ఉంటే.. మరికొందరిలో శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు లాంటి తీవ్ర స్థాయి ప్రభావం కనిపిస్తోంది. ఇదంతా వైరస్‌ మ్యుటేషన్‌ల వల్లే అంటున్నారు వైద్యులు. అంతే కాదు. ఎప్పటికప్పుడు కరోనా లక్షణాల జాబితానూ మార్చుతున్నారు. సెకండ్‌ వేవ్‌లో కరోనా కొత్త లక్షణాలను వాటిలో చేర్చారు. వీటిలో ఏ ప్రభావం కనిపించినా పరీక్షలు చేయించుకోవాలని చెబుతున్నారు. అదే సమయంలో హోం ఐసోలేషన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలనూ వివరిస్తున్నారు. సరైన విధంగా కొవిడ్ నిబంధనావళి పాటిస్తే... బాధితులు త్వరగా కోలుకునే అవకాశముంటుందని స్పష్టం చేస్తున్నారు.

What are the symptoms of corona, what precautions should be taken covid positive time
'ఏ లక్షణాలుంటే కరోనా, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి'

By

Published : Apr 29, 2021, 12:17 PM IST

'ఏ లక్షణాలుంటే కరోనా, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి'

కరోనా వ్యాప్తి చెందుతున్న తొలి దశలో... ప్రపంచ ఆరోగ్య సంస్థ-డబ్ల్యూహెచ్​ఓ.. జలుబు, దగ్గు, జ్వరం... ఈ మూడు లక్షణాలుంటే..వైరస్ బారిన పడినట్టు గుర్తించాలని చెప్పింది. తరవాత...వైరస్ స్వభావం క్రమంగా మారుతూ వచ్చింది. ఉత్పరివర్తనాలు... వైరస్ ప్రభావాన్ని తీవ్రతరం చేశాయి. ఈ క్రమంలో లక్షణాల్లోనూ మార్పులు వచ్చాయి. గొంతు నొప్పి, వాంతులు, విరేచనాలు, ఒళ్లు నొప్పులు... ఇలాంటివన్నీ తోడయ్యాయి. ఫలితంగా...ఈ లక్షణాల జాబితానూ పెంచుకుంటూ వస్తోంది డబ్ల్యూహెచ్​ఓ. వైరస్‌ జన్యుక్రమం మారుతున్న కొద్ది... కొవిడ్ లక్షణాలు మారిపోతున్నాయి. శ్వాస తీసుకోటంలో ఇబ్బంది, గుండె, మూత్ర పిండాలపై ప్రతికూల ప్రభావం లాంటివి అత్యధిక కేసుల్లో కనిపిస్తున్నాయి. ఇప్పుడు సెకండ్ వేవ్‌లో మరి కొన్ని లక్షణాలు ఈ జాబితాలో చేరాయి.

ఇవి లక్షణాలు

ప్రస్తుత మ్యుటెంట్‌లకు గురవుతున్న వైరస్‌ సోకితే... ఏయే లక్షణాలుంటాయో ఇటీవలే శాస్త్రవేత్తలు వెల్లడించారు. గొంతునొప్పి, గరగర..! ప్రపంచ వ్యాప్తంగా 52% మంది కరోనా బాధితుల్లో కనిపించిన లక్షణమిది. ఈ సెకండ్‌ వేవ్‌లో ఇది అధికమైందంటున్నారు వైద్యులు. అనుకోకుండా జలుబు చేయటం, వణుకు రావటం, కళ్లు ఎర్రబడటం, రోజుల పాటు జలుబు వేధించటం..! వీటితోపాటు తీవ్రంగా జ్వరం వస్తే... కరోనాగా భావించి పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. ఉన్నట్టుండి నీరసపడిపోవటమూ కరోనా లక్షణాల్లో ఒకటి. కడుపులో వికారం, వాంతులవటం లాంటి లక్షణాలు రెండో దశ వైరస్ వ్యాప్తిలో చాలా మంది బాధితుల్లో కనిపిస్తున్నాయి.

మరికొన్ని లక్షణాలు

లాలాజలం రాకపోవటమూ కరోనా లక్షణాల్లో ఒకటిగా చెబుతున్నారు వైద్యులు. కొంత మంది బాధితులు ఆహారాన్ని సరైన విధంగా నమలలేకపోతుండటాన్నీ గమనించారు. కీళ్లు, కండరాల నొప్పులూ కరోనా లక్షణమే. మరికొందరి రోగుల్లో దగ్గినప్పుడు వచ్చే తెమడలో రక్తపు చారికలు సైతం కన్పిస్తున్నాయి. రక్తంలో ప్లేట్‌లెట్స్ అకస్మాత్తుగా పడిపోవడం కొవిడ్ ప్రారంభ దశకు సంకేతమని కొందరు వైద్యులు చెబుతున్నారు. కొందరు బాధితుల్లో జ్ఞాపక శక్తి తగ్గిపోవటాన్నీ గుర్తించామని పలువురు వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వీటిలో ఏ లక్షణాలు కనిపించినా... వెంటనే పరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నారు.

ఏమేం చేయకూడదు

కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ కాగానే...హోం ఐసోలేషన్‌లో ఉండటం అత్యంత కీలకం. ఈ సమయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే.. అంత సులువుగా కరోనా ప్రభావం నుంచి బయటపడొచ్చు. ఇక్కడే కొందరు నిర్లక్ష్యం వహిస్తూ...మిగతా కుటుంబ సభ్యులకూ వైరస్ సోకటానికి కారణమవుతున్నారు. అందుకే..హోం ఐసోలేషన్‌లో ఉన్న సమయంలో ఏమేం చేయాలి..? ఏమేం చేయకూడదో వైద్యులు వివరిస్తున్నారు. ఇంట్లో స్వీయ నిర్భంధ వసతులు ఉంటేనే కరోనా సోకిన వ్యక్తిని హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంచాలి. కరోనా వ్యాధి సోకిన వారిని ఇంటి సభ్యులకు, పిల్లలకు, వృద్ధులకు దూరంగా ఇంట్లోనే ఒంటరిగా ఒక గదిలో ఉండేలా తగిన ఏర్పాట్లు చేయాలి. కరోనా సోకిన వ్యక్తిని గాలి, వెలుతురు బాగా ఉన్న గదిలో ఒంటరిగా ఉంచాలి. ఇరవై నాలుగు గంటలూ ఎవరో ఒకరు అందుబాటులో ఉంటూ వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ ఉండాలి. సంరక్షకులుగా మధ్య వయస్కులైతే మంచిది.


పండ్లు ఎక్కువగా తీసుకోవాలి

రోగి తన శరీర ఉష్ణోగ్రత నమోదు చేసుకోవటం, పల్స్‌రేటు చూసుకోవటం, ఆక్సిజన్ లెవల్స్ ఆక్సీమీటర్‌తో చూసుకుంటూ, వివరాలన్నీ తమ వైద్యునికి తెలియచేస్తూ ఉండాలి. వైద్యులు సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడాలి. మూడంచెల మాస్కు అన్ని వేళలా ధరించాలి. ప్రతి 8 గంటల కొక్కసారి మాస్క్‌ మార్చుకోవాలి. కరోనా రోగి తన బట్టలను లేదా తను వాడే వస్తువులను ఎప్పటికప్పుడు తానే శుభ్రపరచుకుని శానిటైజ్ చేసుకోవాలి. వాడి పారవేసే గ్లౌజులు, తినటానికి ఉపయోగించిన కప్పులు, గ్లాసులు, ప్లేట్లు వంటివి ఒక సంచిలో పెట్టి తనగదిలోని చెత్తబుట్టలోనే వేయాలి. రోగనిరోధక శక్తిని పెంచే సీ విటమిను ఉండే నిమ్మ, బత్తాయి, ఉసిరి, కివీ, ఆపిల్, బొప్పాయి వంటి పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. పచ్చికూరగాయలతో సలాడ్స్, కోడిగుడ్లు, ఆకుకూరల వంటివి ఆహారంలో చేర్చుకోవచ్చు. యోగా, ధ్యానం, వ్యాయామం వంటివి చేయాలి. కరోనా లక్షణాలు కన్పించిన 17 రోజుల నుంచి 22 రోజుల వరకు ఐసోలేషన్‌లో ఇంట్లోనే ఉండటం మంచిది.

మాస్క్‌లు తప్పనిసరి

కరోనా మహమ్మారి ఉప్పెనలా విరుచుకుపడుతుండటం వల్ల కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ఇంట్లో ఉన్నా మాస్క్‌లు ధరించాల్సిన సమయమిదని తెలిపింది. సెకండ్‌ వేవ్‌లో వైరస్‌ శరవేగంగా వ్యాపిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ భౌతిక దూరం కచ్చితంగా పాటించాలని సూచించింది. మాస్క్‌లు ధరించినప్పుడు వ్యక్తుల మధ్య కొవిడ్‌ వ్యాపించదని పేర్కొంది. ప్రజలు అనవసర భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని చెబుతోంది. కుటుంబంలో ఒకరికి కొవిడ్ పాజిటివ్‌ వస్తే ఆ వ్యక్తి ఇంట్లో మాస్క్‌ ధరించి ఉండాల్సిందే. వ్యాధి తగ్గేంత వరకూ కరోనా సోకిన వ్యక్తి ఇతర కుటుంబ సభ్యులతో కలవకూడదు. ఐసోలేషన్‌లో ఉన్నా, క్వారంటైన్‌లో ఉన్నా బయటకు వచ్చి ఇతరులతో కలవటం, సన్నిహితంగా ఉండటం వలన వ్యాధి ఇతరులకు సోకే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంటికే పరిమితమవ్వాలి.

అలక్ష్యం చేయకూడదు

క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తులు ఇంట్లో కూడా ఒకరికొకరు సామాజిక దూరం పాటించాలి. దగ్గినా, తుమ్మినా ఖర్చిఫ్‌ అడ్డుపెట్టుకోవాలి. వైద్యులను సంప్రదించకుండా మందులు వాడకూడదు. రోగి వాడిన దుస్తులు, వస్తువులు ఇతరులు ముట్టుకోకూడదు. దీర్ఘకాలిక రోగులకు కరోనా వ్యాధి సోకి నయంకాకపోతే వీలైనంత వరకు ఆసుపత్రిలో చేర్చటం మంచిది. ఎక్కువ రోజులు ఇంట్లో ఉంచటం క్షేమం కాదు. కరోనా రోగిపట్ల ఇతర కుటుంబ సభ్యులు అలక్ష్యం చేయకూడదు. ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తూ ఉండి వైద్యులను సంప్రదిస్తూ ఉండాలి.


పౌష్టికాహారం తీసుకుంటూ

అందరి ఇళ్లలో సురక్షిత హోం ఐసొలేషన్‌ సాధ్యపడడం లేదన్నది పలువురి వాదన. ఒకటి, రెండు ఇరుకైన గదుల్లో ఉండే కుటుంబాలు అవస్థలు పడుతున్నాయి. ఇరుకుగా ఉండే ఇళ్లలో పాజిటివ్‌ వ్యక్తి ఉంటే సురక్షితంగా ఎలా ఉండగలమంటూ ప్రశ్నిస్తున్నాయి. ఇంట్లో ఒకే బాత్‌రూమ్‌ ఉంటే...ఎలా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వృద్ధులు, చిన్నారులు ఉన్న కుటుంబాలు మరింత వేదనకు గురవుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఐసోలేషన్‌లో, హోమ్‌క్వారంటైన్‌ లో ఉన్నవారు ఎవరైనా జ్వరం తగ్గకపోయినా, దగ్గు తగ్గకుండా, ఛాతీ నొప్పిగా, ఊపిరి ఆడకుండా ఎలాంటి అస్వస్థత అన్పించినా దగ్గరలోని కొవిడ్‌ ఆసుపత్రిలో సంప్రదించి సరైన వైద్యం చేయించుకోవాలి. నిర్లక్ష్యం చేయకూడదు. అశ్రద్ధ ఎంత మాత్రమూ మంచిది కాదు. మందులు వాడుతూ అన్ని జాగ్రత్తలతో పౌష్టికాహారం తీసుకుంటూ ఉంటే రోగి త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది.

ఇదీ చూడండి:కరోనా ఉప్పెన: దేశంలో మరో 3.79 లక్షల కేసులు

ABOUT THE AUTHOR

...view details