కేంద్ర జలశక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ను ఏపీ జలవనరుల శాఖ అధికారులు స్వాగతించారు. నోటిఫికేషన్లో కొన్ని సవరణలు చేయాల్సి ఉందన్నారు. విభజన తర్వాత ఈ ఏడేళ్లలో ఎలాంటి వివాదాలు లేవని ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామల రావు తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి కేవలం సాగునీటికి అవసరం ఏర్పడినప్పుడే చేయాలన్నారు. కానీ 45 రోజుల నుంచే ఎలాంటి ఇండెంట్ లేకుండా, కేఆర్‌ఎంబీ ఆదేశాలు లేకుండా తెలంగాణ.. విద్యుత్ ఉత్పత్తి చేసిందని వివరించారు.
అందుకే సుప్రీంను ఆశ్రయించాం..
శ్రీశైలం నుంచి 29 టీఎంసీల నీరు విద్యుత్ ఉత్పత్తి కోసం వాడేశారని.. దీనివల్ల పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తీసుకోలేని పరిస్థితి నెలకొందని శ్యామలరావు చెప్పారు. పులిచింతల వద్ద కూడా విద్యుత్ ఉత్పత్తి కోసం వాడిన 8 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలోకి విడిచి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు. అందుకే ముఖ్యమంత్రి జగన్.. ప్రధానికి లేఖ రాశారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వేటినీ పట్టించుకోలేదని, అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించామన్నారు.
'తాజాగా కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ను స్వాగతిస్తున్నాం. బేసిన్ పరిధిలో లేని ప్రాజెక్టులు కూడా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. వాటిని సవరించాల్సి ఉంది. వెలిగొండ లాంటి ప్రాజెక్టుకు అనుమతి లేని ప్రాజెక్టుగా చూపించటంలో అక్షర దోషాలు దొర్లాయి. వాటిని సవరించాల్సిందిగా కేంద్రాన్ని కోరుతాం.'