GHMC Wards Inauguration today :పరిపాలన వికేంద్రీకరణ, ప్రజలకు మెరుగైన సేవలు అందిచటమే లక్ష్యంగా ప్రభుత్వం హైదరాబాద్‌లో వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు జీహెచ్ఎంసీలోని పలు వార్డు కార్యాలయాలను ప్రజాప్రతినిధులు ప్రారంభించనున్నారు. ప్రజలు తమ సమస్యలను ఫిర్యాదు చేసిన వెంటనే పరిష్కారం లభించేలా ఈ కార్యాలయాలు పనిచేయనున్నాయి.
Wards Governance in GHMC Starts From Today : ఇక్కడ రోడ్లు, డ్రైనేజీల వంటి వాటి నిర్వహణకు ఇంజినీరింగ్ సిబ్బంది, భవన నిర్మాణానికి సంబంధించిన అంశాలపై టౌన్ ప్లానింగ్ సిబ్బంది, దోమల సమస్యకు ఎంటమాలజీ విభాగం అధికారులు అందుబాటులో ఉంటారు. మహిళా సంఘాలకు ఉపయుక్తంగా ఉండేలా వార్డు కమ్యూనిటీ ఆఫీసర్, పారిశుద్ధ్య సిబ్బంది సమన్వయానికి వార్డు శానిటరీ జవాన్, అర్బన్ బయోడైవర్సిటీ సూపర్‌వైజర్, తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణకు జలమండలి నుంచి వార్డు అసిస్టెంట్, విద్యుత్ శాఖ తరఫున వార్డు లైన్‌మెన్, ఓ కంప్యూటర్ ఆపరేటర్.. ఈ కార్యాలయాల్లో ఉంటారు.
Wards Governance in GHMC : వార్డు అధికారుల జాబ్ చార్టుతో పాటు పౌరుల ఫిర్యాదులను ఎంత కాలంలో పరిష్కరిస్తారో చెప్పే సిటిజన్ చార్ట్‌ని ఇక్కడ ఏర్పాటు చేశారు. స్థానిక వార్డు కార్యాలయానికి కాకుండా ఇతర వార్డు కార్యాలయంలో ప్రజలు ఫిర్యాదు చేస్తే, వాటిని స్వీకరించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన బాధ్యత వీరిపై ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాలు లేదా జీహెచ్‌ఎంసీవిభాగాలతో సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత వార్డు అధికారులపై ఉంటుంది.