మనసు సరిగా లేని సమయాల్లో ఉల్లాసాన్ని కలిగించే ఉత్తమ సాధనం సంగీతం. మానసిక సమస్యలను అధిగమించడానికి అదో దివ్యఔషధంగా పని చేస్తుంది. అలాగే శుభకార్యాల్లో అందరినీ అలరించేందుకు మ్యూజిక్ తప్పనిసరి. దీంతో శ్రోతలను మంత్రముగ్ధులను చేసే సామర్థ్యం ఉన్నవారు ఈ రంగంలో రాణిస్తున్నారు. సంగీతానికి సంబంధించి వివిధ విభాగాల్లో నైపుణ్యం సాధించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. పాటల రచయితలు, గాయకులు, మ్యుజీషియన్లు, ఇన్స్ట్రుమెంటల్ ఆర్టిస్టులు, కీబోర్డు ప్లేయర్లు, టెక్నీషియన్లు, సపోర్ట్ స్టాఫ్, మ్యూజిక్క్రిటిక్ వంటి కెరియర్లు అందుబాటులో ఉన్నాయి.
సంగీతమే కెరియర్‌గా మలుచుకోవడమనేది మంచి నిర్ణయమే అయినా ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. వాటిని అధిగమించి ముందుకు సాగాలి. ఈ రంగంలో ఎంతవరకు రాణిస్తామనేది మన చేతుల్లోనే ఉంటుంది. కెరియర్ తొలినాళ్లలో కొంత అయోమయం, ఆందోళన ఉండటం సహజమే అయినా భయపడకుండా ఎంతోమందిని సంగీత సాగరంలో ముంచెత్తడానికి సిద్ధం కావాలి. ముఖ్యంగా నాలుగు అంశాలు సంగీతరంగంలో భవిష్యత్తుకు మార్గాన్ని సుగమం చేస్తాయి.
1. వృత్తి నైపుణ్యాలను పెంచుకోవాలి
సంగీత రంగంలో రాణించాలనుకుంటే అందులో నైపుణ్యం ఉండాలి. దానిపై విస్తృతమైన అవగాహనపెంచుకోవాలి. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఇన్స్ట్రుమెంట్స్ వాయించడం, సంగీతం వినడం, అర్థం చేసుకోవడం, అనుసరించడం తదితర అంశాలపై దృష్టి సారించాలి. వీలైనంత సమయాన్ని వెచ్చించాలి. అలా వాటిపై అవగాహనను పెంచుకున్న తర్వాత వాటి మీద సాధన చేయాలి. నిత్యం అత్యధిక సమయం దానికే కేటాయించాలి. దీనివల్ల మీరు దేనికోసం కృషి చేస్తున్నారో ఆ దిశగా అడుగులు పడతాయి.
2. విస్తృత పరిచయాలు చేసుకోవాలి
సంగీతంలో నైపుణ్యాలను పెంచుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఇండస్ట్రీలో పరిచయాలు పెంచుకోవడం చాలా ముఖ్యం. మ్యూజిక్.. సమాజానికి చెందిన కార్యకలాపం. కాబట్టి ఈ రంగంలోకి వెళ్లేవారు కమ్యూనిటీలపైనే ఆధారపడాల్సి ఉంటుంది. అందుకే ప్రొఫెషనల్ నెట్‌వర్క్‌ను విస్తృతం చేసుకోవాలి. ఇతరులతో పరస్పర అవగాహనతో మెలగాలి. వారితో సంగీత మెలకువలను పంచుకుంటూ ముందుకు సాగాలి.