ఓటేద్దాం - మంచి నాయకుడిని ఎన్నుకుందాం - ప్రజాస్వామ్యాన్ని బలపరుద్దాం Voter Awareness Telangana 2023 : సమాజంలో మార్పుతో కూడిన అభివృద్ధి సాధించాలంటే పౌరులు యుద్ధాలు, త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. చేయాల్సిందల్లా కేవలం.. పోలింగ్ రోజు నీకున్న హక్కు సద్వినియోగం చేసుకోవడమే. నీ కర్తవ్యం నెరవేర్చాల్సిన రోజున బాధ్యరాహిత్యంగా వ్యవహరిస్తే.. సమాజమే కాదు, దేశం కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇలాంటి విషయాలపై ఎన్నికల వేళ ఇబ్బడిముబ్బడిగా కొన్ని సందేశాలు వైరల్‌గా మారాయి. మార్పు కోసం సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తమవంతు ప్రయత్నం చేస్తున్నారు.
Voter Awareness Telangana : 'నేను కచ్చితంగా ఓటు వేస్తా'.. నినాదంతో హోరెత్తుతున్న తెలంగాణ
Telangana Assembly Elections 2023 : 'ఎవరు మారాలి.. ఎందుకు మారాలి..' మార్పు గురించి ఎక్కడైనా, ఎవరైనా చెబితే అంతా చేసేద్దాం అనేంత ఉత్సాహం వస్తుంది. కానీ చేయం. ఎందుకంటే అలసత్వం. చాలా మందికి వాయిదాలు వేసుకుంటూపోయే ఒక దురలవాటు ఉంటుంది. కొన్ని విషయాల్లో వాయిదాలు కలిసివచ్చినా.. కొన్నిచోట్ల మంచిది కాదు. అలాంటి వాటిలో ఓటు ముందు వరుసలో ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి 60 ఏళ్లు జీవిస్తాడనుకుంటే.. ఐదేళ్లకోమారు వేసే ఓటును కేవలం 8 సార్లు మాత్రమే వినియోగించుకోగలడు. ఈ 8 సార్లు తను తీసుకునే నిర్ణయంపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. 6 దశాబ్దాల జీవితకాలంలో అత్యంత తక్కువ సార్లు వచ్చే ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ప్రతి ఒక్కరి విధి.
రైట్ టు ఓట్ - ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉత్సాహంగా ఉన్న యువత
దేశం గురించి ఆలోచన చేసే ప్రతి ఒక్కరూ నేను మారాలి అని ముందడుగు వేస్తే సమాజం బాగుపడుతుంది. ఆ మార్పు అనేది ముందు నీతో ప్రారంభం కావాలి. మరి దేశం బాగుపడాలంటే పాలించే నాయకులు మంచివారై ఉండాలి. ఇది ఎప్పుడు సాధ్యం అవుతుందంటే.. ఓటరు దేవుడు సరైన నాయకుడిని ఎన్నుకున్నప్పుడే. కీలకమైన ఈ విషయం దగ్గరకు వచ్చేసరికి ఎన్నో అడ్డుగోడలు ఎదురొచ్చి.. జనం దేశాభివృద్ధిని కాలరాస్తున్నారు. కొందరు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి ఎదురవుతోంది. ఇలాంటి వారి వల్లే ఎంతో మంది అవినీతిపరులైన నేతలు గద్దనెక్కి రాష్ట్రాలు, దేశాన్ని పాలిస్తున్నారు.
మార్పు తప్పనిసరి..: నాయకుడిగా ఎవరిని ఎన్నుకుంటున్నాం? ఎందుకు ఎన్నుకుంటున్నాం? ఓటు హక్కు ఎలా వినియోగించుకుంటున్నామో కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. స్వార్థ పూరితమైన సమాజంలో నిస్వార్థపరుడైన నాయకుడిని ఎందుకు ఎన్నుకోలేకపోతున్నామో ఎవరి అంతరాత్మను వారు ప్రశ్నించుకోవాలి. ఓటుకు విలువ కట్టి అసమర్థులను, దోపిడీదారులను ఎన్నుకుంటే సమాజం భవితవ్వం ఏమిటనేది అందరూ ఆలోచించాల్సిన విషయం. అవినీతి, అక్రమాలు, అన్యాయం రాజ్యమేలుతున్న ప్రస్తుత సమాజంలో మార్పు అనేది తప్పక రావాలి. ఆ మార్పు మంచి నాయకుడిని ఎన్నుకున్నప్పుడే సాధ్యం అవుతుంది.
'గ్రేటర్' ఓటరు మహాశయా మేలుకో - ఓటు హక్కు వినియోగించుకుని మంచి నాయకుడిని ఎన్నుకో
ప్రస్తుతం ఎన్నికలు, ప్రలోభాలు పర్యాయపదాలుగా మారిపోయాయి. ఓటర్లకు డబ్బులు ఎరవేస్తున్న నాయకుల్లో గెలిచిన వారు.. తదుపరి ఐదేళ్లు ప్రజల ముఖం కూడా చూడరు. ఈ పరిస్థితులు పారదోలాలంటూ ఎన్నికల సంఘం విభిన్నంగా అవగాహన కల్పిస్తోంది. ఓటరులారా.. ఒక్క విషయం ఆలోచించండి అంటున్న ఈ అక్షరాలు.. ఓటును అమ్ముకోవద్దని సూచిస్తున్నాయి. రోజుకు 27 పైసలకు ఓటును అమ్ముకుని బిచ్చగాడి కంటే కూడా హీనంగా మారొద్దని నిత్యం ఎన్నో స్వచ్ఛంద సంస్థలు విన్నవిస్తున్నాయి. డబ్బు, మందు వంటి ప్రలోభాలకు లొంగకుండా మంచి నాయకుడిని ఎన్నుకోవాలని అధికారులు కోరుతున్నాయి.
అందరూ కదలిరండి..: ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు.. అంగ, అర్థ బలం ఉన్న నేతలను రంగంలోకి దించుతున్న ఈ రోజుల్లో.. ఓటరు తెలివిగా వ్యవహరించాల్సి ఉంది. ఈ పరిస్థితి మార్చడానికి ఓటర్లందరికీ ఉన్న మహా ఆయుధం నోటా. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరూ నచ్చకపోతే వారిని తిరస్కరించడానికి 'నోటా' వీలు కల్పిస్తోంది. నోటా వచ్చాక నాయకుల ఎంపికలో కొంత మార్పు కనిపించినా.. ఉన్నంతలో ఉత్తముల్ని ఎన్నుకోవడం ఓటర్లకు ఉన్న ఒక మార్గం. ఈ కొన్ని నిమిషాలు వెచ్చించి పౌరులిచ్చే తీర్పు.. రాబోయే ఐదేళ్ల పాటు వారి జీవన స్థితిగతుల్ని ప్రభావితం చేస్తుంది. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు నిరుపయోగం కాకుండా అందరూ సద్వినియోగం చేసుకుంటేనే ప్రజాస్వామ్యం ప్రకాశిస్తుంది. ఆ క్షణాలు కొన్ని గంటల్లో మన ముందుకు రాబోతున్నాయి. రాష్ట్ర భవిష్యత్తును మార్చే మీ ఓటు వేయడానికి అందరూ కదలి రండి. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయండి.
ఓటే నీ ఆయుధం- విడవకు నీ బ్రహ్మాస్త్రం