తెలంగాణ

telangana

ETV Bharat / state

మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు

ఓటుకు నోటు కేసులో విచారణకు హాజరుకావాలని కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డికి ఈడీ నోటీసు జారీ చేసింది. స్టీఫెన్ సన్ కు ఇవ్వజూపిన యాభై లక్షలు ఎక్కడివంటూ... మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి, ఆయన కుమారుడిని ఈడీ లోతుగా ప్రశ్నించింది.

By

Published : Feb 13, 2019, 7:53 AM IST

Updated : Feb 13, 2019, 8:16 AM IST

ఓటుకు నోటు

ఓటుకు నోటు
ఓటుకు నోటు కేసులో ఈడీ దర్యాప్తును వేగవంతం చేసింది. విచారణకు హాజరు కావాలని కాంగ్రెస్​ నేత రేవంత్​రెడ్డి, ఆయన అనుచరుడు ఉదయసింహాలకు నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి, ఆయన కుమారుడు కృష్ణ కీర్తన్ రెడ్డిని ఈడీ బృందం లోతుగా ప్రశ్నించింది. స్టీఫెన్ సన్ కు ఇచ్చేందుకు తీసుకెళ్లిన యాభై లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చారని అధికారులు ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి, ఉదయ్​సింహాలకు యాభై లక్షల రూపాయలు వేం కృష్ణ కీర్తన్ రెడ్డి సికింద్రాబాద్​లో అందజేసినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. దాని ప్రకారం ఆ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో ఈడీ విచారణ కొనసాగుతోంది. మూడున్నరేళ్ల తర్వాత ఇప్పుడు ఈడీ ఎందుకు రంగంలోకి దిగిందో అర్ధం కావడం లేదని వేం నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డికి ఓటు వేసేందుకు.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు 50 లక్షల రూపాయల లంచం ఇచ్చేందుకు ప్రయత్నం చేశారని అభియోగం. ఏసీబీ అభియోగపత్రం ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ.. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం దర్యాప్తు జరుపుతోంది.
Last Updated : Feb 13, 2019, 8:16 AM IST

ABOUT THE AUTHOR

...view details