శాసనమండలిలో రాములు నాయక్, యాదవరెడ్డిలపై అనర్హత వేటు ఉత్తర్వులు చట్టబద్ధంగా ఉన్నట్లు హైకోర్టు తేల్చింది. అనర్హతను సవాల్ చేస్తూ రాములు నాయక్, యాదవరెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాలను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
వాదనలు విన్న ధర్మాసనం..
తెరాస నుంచి కాంగ్రెస్లో చేరారంటూ.. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద రాములు నాయక్, యాదవరెడ్డి, భూపతిరెడ్డిలపై అప్పటి శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ అనర్హత విధించారు. మండలి నిర్ణయం చట్ట విరుద్ధంగా ఉందని.. అనర్హత ఎత్తివేయాలని ముగ్గురు నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ వాదన వినకుండానే.. కేవలం మీడియా కథనాల ఆధారంగా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడినందునే వారిపై అనర్హత విధించినట్లు... పార్టీ మారినట్లు ఆధారాలున్నాయని మండలి, ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ వాదించారు. ఇరువురి వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం రాములు నాయక్, యాదవరెడ్డిల పిటిషన్లు కొట్టివేసింది.