ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు రేషన్ సరుకులు తీసుకుంటున్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేసింది. ఇంటింటికీ రేషన్ సరుకులు పంపిణీలో భాగంగా ఎమ్మెల్యే కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు ఉండటంతో వాలంటీరు రేషన్ సరుకులను ఇంటికి తెచ్చి ఇచ్చారు. బియ్యం సంచితో పాటు కుటుంబ సభ్యులతో దిగిన చిత్రాన్ని ఎమ్మెల్యే అప్పలరాజు తన ఫేస్‌బుక్ ఖాతాలో ఉంచారు. "నాకు బియ్యం అప్పగించిన విధానం ప్రకారం... వాలంటీర్ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోంది. గుమ్మం వద్దకే వచ్చి వారు సేవలు అందిస్తున్నారు" అని ఆయన పోస్టు చేశారు. ఇది విస్తృతం కావటంతో ఆయనకు తెల్ల రేషన్‌కార్డు ఎలా వచ్చిందంటూ పలువురు ప్రశ్నించారు.
రేషన్‌కార్డు విషయంపై ఎమ్మెల్యే అప్పలరాజు స్పందించారు. 2010-11లో గులాబీ కార్డు కోసం దరఖాస్తు చేయగా తెలుపు కార్డును రెవెన్యూ శాఖ మంజూరు చేసిందన్నారు. వెంటనే రేషన్ కార్డు రద్దు చేయాలని దరఖాస్తు చేసినట్లు పలాస ఎమ్మెల్యే తెలిపారు. తన పేరు మీద ఇప్పటి వరకు రేషన్ కార్డు ఉన్నట్లు తెలియదని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తన పేరుతో ఉన్న రేషన్ సరుకులు ఎవరు తీసుకుంటూన్నారో విచారణ చేపట్టాలని అధికారులను కోరారు.