ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే పైడితల్లి అమ్మవారి జాతర ఈనెల 7న ప్రారంభమైంది. నెల రోజుల పాటు జరగనున్న అమ్మవారి జాతరలో తొలేళ్లు, సిరిమానోత్సవం ప్రధాన ఘట్టాలు. వీటిని ఏటా క్రమంగా తప్పుకుండా నయానందకరంగా నిర్వహిస్తారు. ఈ వేడుకలను తిలకించేందుకు ఒడిశా నుంచీ పెద్దఎత్తున భక్తులు తరలివస్తారు. కరోనా దృష్ట్యా ఈ ఏడాది అమ్మవారి సిరిమానోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఆ మేరకు ప్రజా రవాణాను నిలిపివేసింది. దుకాణాలను సైతం మూసివేయించారు. ఉచిత దర్శనాలనూ నిలిపివేశారు. ఆన్‌లైన్‌లో టికెట్లను విక్రయించేలా ఏర్పాట్లు చేశారు. సిరిమాను రథం వెనుక వందల మంది కార్యకర్తలు తిరిగే అవకాశమున్నందున వారినీ వీలైనంత తక్కువగా అనుమతించాలని నిర్ణయించారు. ఆలయ సంప్రదాయాలను పాటిస్తూనే భక్తులను నియంత్రించాలని నిర్ణయించారు.
పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సుమారు 3 వేల మంది పోలీసులు 2 విడతల్లో విధులు నిర్వహించేలా చర్యలు చేపట్టారు. ముగ్గురు అదనపు ఎస్పీలు, 11మంది డీఎస్పీలు, 45 మంది సీఐలు భద్రతను పర్యవేక్షించనున్నారు. స్థానికులనూ సిరిమానోత్సవ ప్రాంతానికి రాకుండా కట్టడి చేయనున్నట్లు అధికారులు తెలిపారు.