ఆ దారి ఏదో ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల రహదారి కాదు. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాకు వాణిజ్య కేంద్రమైన విజయవాడ నుంచి మరో ముఖ్య పట్టణం గుడివాడకు వెళ్లే ప్రధాన రహదారి. గజానికో గొయ్యి, అడుగుకో చీలిక ఎటు చూసినా కొట్టుకుపోయిన కంకర. పైగా ఓ వైపు పంట కాలువలు మరోవైపు పంట పొలాల మధ్య ఉన్న ఇరుకు రోడ్డుపై ప్రయాణించాలంటే ఒళ్లు హూనం కాకతప్పదు. ఎదురుగా మరో వాహనం వచ్చినా తప్పించడమంటే సాహసమే. కొద్దిగా ఆదమరచినా.. తవ్వినట్లున్న గోతుల్లో పడిపోయో ప్రమాదమూ ఉంది. ఇవన్నీ ఏళ్లుగా ఈ రహదారిపై ప్రయాణిస్తున్న వారి అనుభవాలే.
విజయవాడ-గుడివాడ రోడ్డు అధ్వానం... పాలకులకు పట్టని వైనం - ఏపీలో రోడ్లు అధ్వానం
ఆ రోడ్డు పొడవు పాతిక కిలోమీటర్లు. అంతా గుంతలమయమే. దానికి తోడు ఓ వైపు పంట కాల్వలు. ఇక ఎదురుగా మరో వాహనం వచ్చిందో అంతే పరిస్థితి. రాత్రి పూటైతే ప్రమాదం జరగని రోజు లేదు. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు కూడా. అయినా పాలకులు మాత్రం అటు వైపు చూడరు. ప్రజల కష్టాలు తీరవు. ఆంధ్రప్రదేశ్ ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోని విజయవాడ-గుడివాడ ప్రధాన రహదారి అధ్వాన పరిస్థితిపై ప్రత్యేక కథనం.
గుడివాడ సహా మరికొన్ని నియోజకవర్గాల ప్రజలు విజయవాడకు రావాలంటే ఈ రహదారే శరణ్యం. వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తులతో సరకు రవాణా వాహానాలూ ఇదే మార్గంలో వెళ్తుంటాయి. దగ్గరి దారికావడంతో చాలా మంది ద్విచక్ర వాహనదారులూ ఈ మార్గంలో పయనిస్తుంటారు. దీంతో నిత్యం రద్దీగా ఉంటుంది. ఎప్పుడో 14 ఏళ్ల క్రితం వేసిన రోడ్డేపైనే ఇప్పటికీ ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొందంటున్న స్థానికులు మధ్యలో మరమ్మతులు చేసినా వారం రోజులైనా నిలవలేదని అంటున్నారు.
ఇటీవల వర్షాలకు రోడ్డు మరింత దెబ్బతినడంతో ప్రయాణం మరీ కష్టమైంది. వాహనాలైతే కొద్ది రోజులకే పాడైపోతున్నాయని నడిపేవారికి కూడా అనారోగ్య సమస్యలతో పాటు ప్రాణాలూ పోయిన సందర్భాలున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. రాత్రిపూటైతే రోజుకు ఓ ప్రమాదం అయినా జరుగుతుందని గుంతలు కనపడక గోతుల్లో పడుతుంటారని అంటున్నారు. కీలకమైన ఈ రహదారిని విస్తరించాలని ఏళ్లుగా కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
- ఇదీ చూడండి: నగరవాసుల బాధ్యతకు బద్ధకపు ముసుగు...!