చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలని, వారికి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఫిక్కీ(హైదరాబాద్) ఆధ్వర్యంలో అంతర్జాల వేదికగా ‘స్వతంత్ర భారత అమృతోత్సవాలు’ ఘనంగా నిర్వహించారు. ఫిక్కీ ఛైర్‌పర్సన్ ఉమా చిగురుపాటి అధ్యక్షతన జరిగిన వేడుకల్లో వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా ఆన్‌లైన్‌లో పాల్గొన్నారు. మహిళల ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారించాలని ఉపరాష్ట్రపతి అన్నారు.
ప్రసూతి మరణాల సంఖ్యను తగ్గించడంలో దేశం గణనీయమైన ప్రగతిని సాధించిందని, ఈ సంఖ్యను 2030 నాటికి మరింత తగ్గించాలన్నారు. మహిళల ఆరోగ్య సంరక్షణ, సాధికారిత, సాధారణ ప్రసూతి అంశాల్లో డాక్టర్ ఎవిటా ఫెర్నాండెజ్ చేసిన కృషిని ఆయన కొనియాడారు. ఆమెకు 29వ యుధ్‌వీర్ స్మారక పురస్కారాన్ని ఆన్‌లైన్‌లో ప్రదానం చేశారు. స్వాతంత్య్ర సమరయోధుడు ఉర్దూ, హిందీ మిలాప్ పత్రికల వ్యవస్థాపకుడు దివంగత యుధ్‌వీర్ చిత్రపటం వద్ద ఆయన నివాళులర్పించారు.