vemula prashanth interview : కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే కలిసివచ్చే వారితో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో జాతీయ స్థాయిలో పోరాడతామని రహదార్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణకు కేంద్రం ఒక్క రూపాయి అదనంగా ఇవ్వలేదన్న ఆయన విభజన చట్టం హామీలు సహా ఏవీ నెరవేర్చలేదని ఆరోపించారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వంగా అన్నీ చేస్తున్నప్పటికీ ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని ఆయన ఆక్షేపించారు. యువత కోసం ఉద్యోగ నోటిఫికేషన్లు త్వరలోనే వస్తాయన్న మంత్రి... అది తెలిసే భాజపా నేతలు దొంగ దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. కొత్త సచివాలయం, అమరవీరుల స్మారకం, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఈ ఏడాది అందుబాటులోకి వస్తాయంటున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ప్రభుత్వానికి రైతులు, పేదలు రెండు కళ్లు. గత హామీలతో పాటు కొత్తవీ నేరవేర్చుతున్నాం. లక్షా 32 వేల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం. పెద్ద రాష్ట్రాల్లో సైతం అన్ని కొలువులివ్వలేదు. స్థానికులకే ఉద్యోగావకాశాలు దక్కాలని కేసీఆర్ లక్ష్యం. 65 వేల పోస్టులు ఖాళీలున్నట్లు జాబితా సిద్ధం చేశారు. త్వరలో మరో 30 వేల ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. బండి సంజయ్‌ది దొంగ దీక్ష. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. మరి దానిని సమాధానం చెప్పరా?. రాష్ట్రానికి తరలివచ్చిన 17 వేల కొత్త పరిశ్రమలు యువతకు ప్రత్యక్షంగా పది లక్షల ఉద్యోగాలు వచ్చాయి.