Vemula Prashant Reddy comments on Congress party : బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరని రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కంటే 10 ఏళ్ల ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని గుర్తు చేసిన ఆయన.. రైతులు, పేదల కోసం కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ది సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని అభిప్రాయపడ్డారు. కర్ణాటక గెలుపుతో తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతం అయ్యిందని భ్రమలు కల్పిస్తున్నారని విమర్శించారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి ఏమీ ఇవ్వడం లేదని ఆరోపించారు. అన్ని తామే చేస్తున్నామని బీజేపీ నేతలు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని మంత్రి ప్రశాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా మొదలుకొని రాష్ట్రంలోని బీజేపీ మండల అధ్యక్షుల వరకు నోరు తెరిస్తే అసత్యాలే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనులను కూడా తామే చేశామని అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
- KTR Tweet Today : 'గ్రామాల అభివృద్ధికి బీఆర్ఎస్ సర్కార్ పెద్దపీట'
- Ponguleti Emotional : 'పొంగులేటి ఎమోషనల్.. సభను అడ్డుకునేందుకు BRS కుట్రలు'
కేసీఆర్ తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ఎందుకు అమలు చేయలేకపోతున్నారని నిలదీశారు. తెలంగాణపై మోదీ ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నారు. రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన ప్రాజెక్టులు, నిధులు.. గుజరాత్, ఉత్తర ప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు అన్యాయంగా తరలిస్తుంటే ఇక్కడి బీజేపీ ఎంపీలు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర బీజేపీ నాయకులకు రాజకీయాలు తప్ప.. తెలంగాణ ప్రజల ప్రయోజనాలు పట్టవని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.