తెలంగాణ

telangana

ETV Bharat / state

వాటా పెంచాల్సిందే

రాష్ట్రాలకు గ్రాంట్లు పెంచాలి... సంక్షేమ పథకాల రూపకల్పనలో స్వేచ్ఛ ఇవ్వాలి... రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం తీసుకున్నాకే... కేంద్ర పథకాలు ప్రవేశపెట్టాలి.. 15వ ఆర్థిక సంఘానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన విజ్ఞప్తులివి.

రాష్ట్రానికి కేటాయింపులు పెంచాలని ఆర్థిక సంఘానికి కేసీఆర్ వినతి

By

Published : Feb 19, 2019, 8:19 PM IST

రాష్ట్రానికి కేటాయింపులు పెంచాలని ఆర్థిక సంఘానికి కేసీఆర్ వినతి
వనరుల వినియోగం రాష్ట్రాలకు అనుకూలంగా ఉండేలా విధానాలు రూపొందించాలన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్ర పర్యటనలో ఉన్న 15వ ఆర్థిక సంఘం సభ్యులతో సమావేశమయ్యారు. జూబ్లీహాల్​లో జరిగిన ఈ భేటీలో తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరించారు.

'స్థానిక' నిధులు పెంచండి

కొత్త పథకాలను రాష్ట్రాలను సంప్రదించకుండానే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే వాటా పెంచాలని ఆర్థిక సంఘాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టుల నిర్వహణకు అవసరమైన గ్రాంట్లు పెంచాలని విజ్ఞప్తి చేశారు. పెరిగిన పంచాయతీలు, పురపాలక సంఘాలను దృష్టిలో ఉంచుకొని కేటాయింపులు చేయాలని నివేదించారు.

పథకాల రూపకల్పనలో స్వేచ్ఛ

14వ ఆర్థిక సంఘం అంచనా ప్రకారం రాష్ట్రాల్లో కేంద్రం వ్యయం 20 శాతం ఉండగా... పెరుగుతున్న వ్యయం దృష్ట్యా ఈసారి వాటా మరింత పెంచాలని కోరారు. స్థానిక అవసరాలనుగుణంగా విధానాలు రూపొందించుకునే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. ఆర్థికంగా పరిపుష్టి ఉన్న రాష్ట్రాలకు జీఎస్​డీపీలో 3శాతం రుణం తీసుకునే వెసులుబాటు, అదేవిధంగా ఒకశాతం అదనంగా పొందేలా అవకాశమివ్వాలని కోరారు. కేంద్ర పన్నుల వాటాను కూడా 42 నుంచి 50శాతానికి పెంచాలని విన్నవించారు.

ఎత్తిపోతలకు రూ.40వేల కోట్లివ్వండి

కోటీ 24లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో 80వేల కోట్లతో కాళేశ్వరం నిర్మిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాల నిర్వహణకు అవసరమయ్యే 40వేల 169కోట్లు కేంద్రం ఇచ్చేలా ప్రతిపాదించాలని కోరారు. అంతేకాకుండా ఇంటింటికీ రక్షిత మంచి నీరు అందించే మిషన్ భగీరథకు 12 వేల 722 కోట్లు గ్రాంటుగా ఇచ్చేందుకు కేంద్రానికి సిఫార్సు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details