భారత నౌకాదళానికి వరుణాస్త్రం చేరింది. ఏపీ విశాఖలోని నౌకా సమరశాస్త్ర ప్రయోగశాల ఎన్.ఎస్.టి.ఎల్ రూపొందించిన ఈ భారీ టార్పెడోను.. భారత డైనమిక్స్ లిమిటెడ్- బీడీఎల్ ఉత్పత్తి చేస్తోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ టార్పెడోను శనివారం నౌకాదళానికి అప్పగించారు. భారత రక్షణ పరిశోధన శాఖ కార్యదర్శి, డీఆర్డీవో ఛైర్మన్ సతీశ్‌రెడ్డి చేతుల మీదుగా నౌకాదళానికి అందజేశారు. విశాఖలోని బీడీఎల్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో షిఫ్ బిల్డింగ్ సెంటర్ డైరక్టర్, వైస్ అడ్మిరల్ కె.శ్రీనివాస్, బీడీఎల్ సీఎండీ సిద్దార్థ్ మిశ్రా, ఎన్.ఎస్.టి.ఎల్ డైరక్టర్ నందగోపన్ పాల్గొన్నారు.
భవిష్యత్ క్షిపణులు బీడీఎల్లోనే..
రక్షణశాఖ పరిధిలోని ఎన్ఎస్టీఎల్, బీడీఎల్ సమన్వయంతో పనిచేసి అత్యాధునికమైన టార్పెడోను అందించాయని డీఆర్డీవో ఛైర్మన్ సతీశ్‌రెడ్డి అభినందించారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా అత్యాధునిక క్షిపణి వ్యవస్థలను బీడీఎల్ ఉత్పత్తి చేయనుందని చెప్పారు. ఎన్ఎస్టీఎల్ రూపొందించిన వరుణాస్త్రను విశాఖలోని బీడీఎల్ యూనిట్లోనే ఉత్పత్తి చేయనున్నారు.
రక్షణశాఖ ఈ టార్పెడోలను ఎగుమతి కూడా చేయనుంది. వీటితోపాటు త్వరితగతిన స్పందించే ఉపరితలం నుంచి గాలిలోకి ప్రయోగించే "క్యూఆర్ శామ్" క్షిపణి వ్యవస్థను బీడీఎల్ రూపొందిస్తుంది. ఈ మధ్యనే దీనిని విజయవంతంగా ప్రయోగించారు. ఇది కాకుండా భారత వాయుసేన కోసం గాలిలో ప్రయోగించే "అస్త్ర" క్షిపణులను కూడా బీడీఎల్ ఉత్పత్తి చేయనుంది.