రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజూ కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగింది. వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు వ్యాక్సినేషన్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా శాయంపేట యూపీహెచ్‌సీలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ వ్యాక్సినేషన్‌ను శ్రీకారం చుట్టారు.
30 నుంచి 50...
తొలిరోజు వరంగల్ జిల్లావ్యాప్తంగా 21 కేంద్రాల్లో టీకా వేయగా... రెండో రోజు 45 కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లాలో 14, కామారెడ్డి జిల్లాలో 7 కేంద్రాల్లో వ్యాక్సిన్ పంపిణీ చేశారు. మొదటిరోజు ఉమ్మడి జిల్లాలో 10 కేంద్రాల్లో టీకాలు వేయగా.. రెండో రోజు 21 కేంద్రాలకు విస్తరించారు. ప్రతి కేంద్రంలో 30 నుంచి 50 మంది వరకు టీకా ఇస్తున్నారు.
పాల్గొన్న ప్రజాప్రతినిధులు...
కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వ్యాకినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. మంథనిలో ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు... హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రిలో ఎమ్మెల్యే సతీశ్‌కుమార్, కొల్లాపూర్‌లో బీరం హర్షవర్ధన్, గద్వాల జిల్లా ఐజలో అబ్రహం, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు.
పలు జిల్లాల్లో...
టీకాలు వేసుకున్న వారు నిర్లక్ష్యం చేయకుండా రెండో డోసు పూర్తయ్యే వరకు జాగ్రత్తలు తీసుకోవాలని మంచిర్యాలలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సూచించారు. బయ్యారం పీహెచ్సీలో ఎమ్మెల్యే హరిప్రియ, కేసముద్రం పీహెచ్సీలో ఎమ్మెల్యే శంకర్‌నాయక్ వ్యాక్సినేషన్‌కు శ్రీకారం చుట్టారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో టీకాల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ శశాంక పరిశీలించారు.
జిల్లావ్యాప్తంగా 25 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మహబూబాబాద్ జిల్లాలో సోమవారం 8 ఆరోగ్య కేంద్రాలలో 400 మంది వైద్యసిబ్బందికి టీకాలిచ్చారు. మేడ్చల్ జిల్లా షాపూర్‌నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా టీకా తీసుకున్న ఇద్దరు అంగన్‌వాడీ సహాయ కార్యకర్తలు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.