మూడు రోజులుగా కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ నగరంలో జలమయమైన ప్రాంతాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. పలు కాలనీలు, బస్తీలు, ఇళ్లు నీటమునిగిన ప్రాంతాలను పరిశీలించారు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానికులతో మాట్లాడారు. తార్నాక డివిజన్ లాలాపేట్‌లోని సత్య నగర్, ఇందిరా నగర్‌లో ముంపునకు గురైన ప్రాంతాలను ఆయన పరిశీలించారు.
స్థానికుల అవస్థలు
ఇళ్లలోకి నీరు చేరడంతో రెండు రోజులుగా తీవ్ర అవస్థలకు గురవుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక నాలాలు పొంగి... మురికి నీరు ఇళ్లలోకి వస్తుందని విచారించారు. పలు కాలనీల్లో అపార్ట్‌మెంట్‌లలోనూ నీరు చేరి బయటకు రాని పరిస్థితి ఏర్పడిందని కాలనీవాసులు వాపోయారు.