Kishan Reddy fire on Telangana government: హైదరాబాద్‌లోని గుడి మల్కాపూర్ డివిజన్‌లో రూ. 90లక్షల వ్యయంతో ప్రారంభించిన పలు అభివృద్ది పనులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా శారదానగర్ కాలనీలో రూ. 44లక్షలతో రోడ్డు, పైప్‌లైన్ పనులు, జీవన్ కల్యాణ్ నగర్‌లో రూ.37లక్షలతో రోడ్డు, పైప్‌లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఉషోదయ కాలనీలో 9.5లక్షల వ్యయంతో నిర్మించిన ప్రైమరీ హెల్త్ సెంటర్ షెడ్‌ను కిషన్‌రెడ్డి ప్రారంభించారు.
అనంతరం రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ గుడిమల్కాపూర్‌లో నివసించే కాలనీవాసుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వ పనితీరు అధ్వాన్నంగా ఉందని.. అభివృద్ది కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదని కిషన్‌రెడ్డి ఆరోపించారు. గుడిమల్కాపూర్ ప్రాంతానికి సంబంధించిన కనీస మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. ఈ ప్రాంతాన్నికి నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని మండి పడ్డారు.
ఓయూ ఆర్ట్స్ కాలేజీ భవనాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చుదిద్దుతాం: జీహెచ్‌ఎంసీలో నిధుల కొరత ఉందని ఆరోపించిన ఆయన.. డబ్బులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్లు ధర్నా చేసే పరిస్థితి నెలకొందని విమర్శించారు. కాలనీ వాసులకు బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. హైదరాబాద్‌లోని అనేక బస్తీలలో కమ్యూనిటీ హాల్స్, మంచినీటి కొరత తీర్చే బోరు సౌకర్యం కల్పిస్తున్నామని మంత్రి వివరించారు. ఓయూ ఆర్ట్స్ కాలేజ్ భవనాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అన్ని రకాల జాగ్రత్త చర్యలతో పాటు పౌష్టిక ఆహారం తీసుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు.
"ఇవాళ నాంపల్లి నియోజక వర్గంలో సుమారు 90లక్షల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా.. శారద నగర్‌లో 44లక్షలతో రోడ్లు. జీవన్ కల్యాణ్‌లో నగర్‌లో 37లక్షలతో రోడ్డులు పైప్ లైన్లు వేయడం జరిగింది. ముఖ్యంగా గుడి మల్కాపురంలో అనేక కాలనీలు ఉంటాయి. వేల మంది జీవనం సాగిస్తారు. వారి సమస్యలు కోసం గతంలో అనేక సార్లు పోరాడారు. అలాంటి ఈ ప్రాంతాన్ని మన తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఈ ప్రాంతంలో కనీస మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది"-కిషన్‌రెడ్డి, కేంద్ర మంత్రి