Kishan Reddy fires on KCR : హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో రైల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసే అర్హత కేసీఆర్‌కు లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. రక్తం ఏరులై పారినా మెట్రో నిర్మాణం చేపట్టనీయమని గతంలో కేసీఆర్ అన్న మాటల్ని గుర్తుచేశారు. మెట్రోరైల్ నిర్మాణానికి అడుగడుగునా ఆటంకాలు సృష్టించిన వ్యక్తికి.. రెండో దశకు భూమిపూజ చేసే అర్హత ఉందా అని, ముఖ్యమంత్రి ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.
పాతబస్తీకి మెట్రోరైల్ ఎందుకు పూర్తి చేయడం లేదో చెప్పాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఓవైసీ మాటకు కట్టుబడి పాతబస్తీ ప్రజలకు మెట్రోను దూరం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎయిర్‌పోర్ట్ మెట్రో ప్రాజెక్టును పూర్తి చేయటానికి కేసీఆర్ సర్కార్‌కు 65 ఏళ్లు పడుతుందని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ముందస్తుకు వెళ్లాలని తహతహలాడుతున్న కేసీఆర్.. ఎన్నికల ప్రచారం కోసం బూటకపు వాగ్దానాలు చేస్తున్నారని విమర్శించారు.