తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎప్పటికప్పుడు ఎందుకు ఫలితాలు వెల్లడించడం లేదు.. అనుమానాస్పదంగా సీఈవో వైఖరి'

రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో జాప్యంపై భాజపా నేతల సీరియస్‌
రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో జాప్యంపై భాజపా నేతల సీరియస్‌

By

Published : Nov 6, 2022, 11:30 AM IST

Updated : Nov 6, 2022, 1:40 PM IST

11:25 November 06

రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో జాప్యంపై భాజపా నేతల సీరియస్‌

మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు రౌండ్ల వారీగా వెల్లడి జాప్యంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు ఎందుకు ఫలితాలు వెల్లడించడం లేదని సీఈవోను ప్రశ్నించారు. కేంద్రమంత్రి ఫోన్ చేసిన 10 నిమిషాల్లోనే.. 4 రౌండ్ల ఫలితాలను సీఈవో అప్‌లోడ్ చేయించారు. ఈ క్రమంలోనే ఉప ఎన్నికల ఫలితాల వెల్లడిలో సీఈవో తీరుపై కిషన్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వైఖరిపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అనుమానం వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల వెల్లడిలో సీఈవో అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెరాసకు లీడ్‌ వస్తే తప్ప రౌండ్ల వారీగా ఫలితాలను అప్‌డేట్‌ చేయడం లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. భాజపాకు ఆధిక్యం లభించినప్పుడు ఫలితాలను వెల్లడించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాల వెల్లడిలో ఎన్నడూ లేనంత ఆలస్యం ఇప్పుడే ఎందుకు జరుగుతోందని సంజయ్ నిలదీశారు.

జాప్యానికి కారణాలేమిటో చెప్పాలి..: ఈ క్రమంలోనే మొదటి, రెండు రౌండ్ల తర్వాత మూడు, నాలుగు రౌండ్ల ఫలితాలను అప్‌డేట్‌ చేసేందుకు జరిగిన జాప్యానికి కారణాలేమిటో సీఈవో చెప్పాలని బండి సంజయ్‌ డిమాండ్ చేశారు. మీడియా నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తే తప్ప.. రౌండ్లవారీగా ఫలితాలను ఎందుకు వెల్లడించడం లేదన్నారు. ఫలితాల విషయంలో ఏ మాత్రం పొరపాటు జరిగినా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని సంజయ్ హెచ్చరించారు. రౌండ్ల వారీగా ఫలితాలు వెల్లడించడంలో సీఈవో విఫలమయ్యారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎంవో నుంచి ఆదేశాలొస్తే తప్ప ఫలితాలు వెల్లడించరా..: మునుగోడు ఎన్నికల లెక్కింపు ఫలితాల వెల్లడిలో గందరగోళంపై భాజపా ఎంపీ కె.లక్ష్మణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో అధికారి ఒక్కో విధంగా చెబుతూ ఫలితాలపై కావాలనే గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. సీఎంవో నుంచి ఆదేశాలొస్తే తప్ప ఫలితాలు వెల్లడించరా అని ప్రశ్నించారు. కుంటి సాకులు చెబుతూ తెరాసకు ఆధిక్యం వచ్చే దాకా కౌంటింగ్ ప్రక్రియను జాప్యం చేస్తారా అన్న ఆయన.. భాజపాకు లీడ్ వచ్చే రౌండ్లలోనే ఫలితాలను అప్‌డేట్ చేయడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారని నిలదీశారు. ఎన్నికల మొదటి రోజు నుంచి కౌంటింగ్ దాకా సీఈవో పని తీరు అనుమానాస్పదంగానే ఉందన్న లక్ష్మణ్‌.. రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే సీఈవో పని చేస్తున్నారని ఆరోపించారు.

ఫలితాలు సక్రమంగా వెల్లడించాలి..: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌తో భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఫోన్‌లో మాట్లాడారు. ఫలితాలు వెల్లడించడంలో ఎందుకు ఆలస్యం అవుతుందని ప్రశ్నించిన ఈటల.. ఫలితాలు సక్రమంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు.

ఎవరెవరికి ఫిర్యాదు చేయాలనేది చర్చిస్తాం..: మునుగోడులో ఫలితాల ప్రకటనలో జాప్యంపై చాలా అనుమానాలు ఉన్నాయని భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు పేర్కొన్నారు. అనుభవం లేని అధికారులు కౌంటింగ్‌లో ఉన్నారని ఆరోపించారు. అధికారుల తీరు అనుమానాలకు తావిస్తోందన్న ఆయన.. ఎన్నికల కమిషన్ ఫలితాలను వెంటనే వెబ్‌సైట్‌లో పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఎవరెవరికి ఫిర్యాదు చేయాలనేది పార్టీ అధ్యక్షుడితో చర్చించి.. నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి..

మేము ఊహించిన స్థాయిలో ఓట్లు రాలేదు: రాజగోపాల్‌రెడ్డి

రౌండ్‌రౌండ్‌కు ఉత్కంఠ.. ఆధిక్యంలోకి తెరాస..

Last Updated : Nov 6, 2022, 1:40 PM IST

ABOUT THE AUTHOR

...view details