Amit shah Hyderabad Tour: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్‌కు రానున్నారు. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో ఎల్లుండి జరిగే ఐపీఎస్‌ల పరేడ్‌లో పాల్గొనేందుకు.. ఈరోజు రాత్రి 10:15 గంటలకు నగరానికి చేరుకోనున్నారు. ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ పోలీస్ అకాడమీకి రోడ్డుమార్గం ద్వారా రాత్రి 10:40 గంటలకు చేరుకొని అక్కడే బస చేయనున్నారు.
రేపు ఉదయం 7:50 గంటల నుంచి 10:30 గంటల వరకు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో నిర్వహించే ఐపీఎస్ పరేడ్‌లో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. పరేడ్ అనంతరం 11 నుంచి 12 గంటల వరకు అధికారులతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు భోజన విరామం అనంతరం.. నేషనల్ పోలీస్ అకాడమీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి 1:20 గంటలకు చేరుకుంటారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1:25 గంటలకు అమిత్ షా దిల్లీకి తిరుగు పయనం కానున్నారు.
సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో ఈ నెల 11న 74వ ఐపీఎస్ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ జరగనుంది. ఈ బ్యాచ్‌లో మొత్తం 195 మంది శిక్షణ తీసుకోగా.. 166 మంది ఐపీఎస్ క్యాడెట్స్, 29 మంది విదేశీ క్యాడెట్లు ఉన్నట్లు అకాడమీ డైరెక్టర్ ఏఎస్ రాజన్ తెలిపారు. కొవిడ్ తర్వాత పూర్తి స్థాయిలో సాధారణ ట్రైనింగ్ కొనసాగిందని.. 65 వారాల పాటు కఠోర శిక్షణ ఇచ్చామని పేర్కొన్నారు. మహిళలు, చిన్నారుల నేరాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు ఏఎస్ రాజన్ వెల్లడించారు.