తెలంగాణ

telangana

ETV Bharat / state

రంగురంగుల చేపలు.. మైమరపించే దృశ్యాలు.. అండర్ వాటర్ టన్నెల్ ఎగ్జిబిషన్​కు అంతా ఫిదా

Underwater Tunnel Expo Start in Visakhapatnam: ఏపీలోని విశాఖపట్టణంలో ప్రారంభమైన ‘అండర్‌ వాటర్‌ టన్నెల్‌ ఎక్స్‌ పో’ ఎగ్జిబిషన్‌ పర్యాటకులను, సందర్శకులను తెగ అలరిస్తోంది. ఎగ్జిబిషన్‌‌ సందర్శించిన వారికి మాటల్లో వర్ణించలేని సరికొత్త అనుభూతులను కలిగిస్తోంది. మూడు నెలలపాటు సాగే ఈ ఎగ్జిబిషన్‌ను ప్రతి ఒక్కరూ సందర్శించి, విజయవంతం చేయాలని మంత్రి గుడివాడ అమర్​నాథ్ కోరారు.

Underwater Tunnel Expo Start in Visakhapatnam
Underwater Tunnel Expo Start in Visakhapatnam

By

Published : Jan 18, 2023, 4:52 PM IST

అలరిస్తున్న అండర్ వాటర్ టన్నెల్ ఎగ్జిబిషన్​.. ఫిదా అవుతున్న సందర్శకులు

Underwater Tunnel Expo Start in Visakhapatnam: అదొక అద్భుత ప్రపంచం. అక్కడ అడుగు పెట్టామంటే ఊహల్లో తేలిపోతాం. అందులో సంచరిస్తున్నంత సేపు సముద్ర గర్భంలో ఉన్నామన్న భావన కలుగుతుంది. ఎటుచూసిన అందమైన చేపల పరుగులు..మైమరపించే దృశ్యాలు, మాటల్లో వర్ణించలేని అనుభూతులు.. అదే ‘అండర్‌ వాటర్‌ టన్నెల్‌ ఎక్స్‌ పో’ ఎగ్జిబిషన్‌.

ఇప్పుటివరకూ విదేశాల్లో చూసిన అండర్ వాటర్ టన్నెల్ ఫిష్ ఎక్స్​ పోను విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఆంధ్రప్రదేశ్​ విశాఖట్టణంలో ఏర్పాటు చేశారు. టన్నెల్‌లోని అందమైన చేపల సముదాయం సందర్శకులను మంత్ర ముగ్ధులను చేస్తోంది. ప్రతీ ఏటా సందర్శకులను ఎంతగానో ఆకట్టుకునే హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ ఫన్ ఫెయిర్ ఎగ్జిబిషన్ తాజాగా విశాఖలో ప్రారంభమైంది. ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన అండర్ వాటర్ టన్నెల్ ఆక్వా ఎక్స్​ పో పర్యాటకులను, సందర్శకులను మరింతగా అలరిస్తోంది.

బీచ్ రోడ్డులోని సబ్ మెరైన్ ఎదురుగా ఉన్న పోలీస్ మెస్ వెనుక గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్‌ను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్​నాథ్ ప్రారంభించి.. టన్నెల్‌లోని వివిధ జాతుల విదేశీ, స్వదేశీ చేపల సముదాయాన్ని ఆసక్తిగా తిలకించారు. అనంతరం మూడు నెలలపాటు ఈ ప్రదర్శన సందర్శకులను అలరించనుందని తెలిపారు. దుబాయ్, సింగపూర్ వంటి దేశాల్లో నిర్వహించే అండర్ వాటర్ టన్నెల్ ఆక్వా ఎగ్జిబిషన్ ఇక్కడి సందర్శకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తోంది.

2వేల రకాల చేపలు: 250 అడుగుల పొడవైన టన్నెల్‌లో 2వేల రకాల అందమైన చేపల సముదాయం, సముద్ర అడుగు భాగంలో ఉండే వింత జీవులు అలా కళ్ల ముందు, మనపై నుండి కదలాడుతుంటే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేం. ఫిష్ అక్వేరియంలలో రంగు రంగుల చేపలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. అండర్ వాటర్‌లో ఉన్నామా లేక మరేదైన లోకంలో ఉన్నామా అన్నట్టుగా సరికొత్త అనుభూతిని మిగులుస్తుంది.

ప్రపంచంలోని పెద్ద పెద్ద దేశాల్లో నిర్వహించే ఇలాంటి ఎగ్జిబిషన్ సంక్రాంతి కానుకగా విశాఖలో ఏర్పాటు చేయడంతో సందర్శకులకు సరికొత్త అనుభూతిగా మారుతుందని మంత్రి గుడివాడ అమర్​నాథ్ అన్నారు. ఇలాంటి ప్రదర్శనలకు ప్రభుత్వం తరపున ప్రోత్సాహం ఉంటుందన్నారు. మూడు నెలలపాటు జరిగే ఈ ఎగ్జిబిషన్‌ను ప్రతి ఒక్కరూ సందర్శించి విజయవంతం చేయాలని కోరారు.

ఈ చేపల పర్యవేక్షణలో నిరంతరం 8 మంది కార్మికులు: విశాఖలో తొలిసారిగా అండర్ వాటర్ టన్నెల్ ఆక్వా ఎక్స్​ పో ఏర్పాటు చేశామని నిర్వాహకులు రాజారెడ్డి తెలిపారు. దీంతో పాటు వరల్డ్ క్లాస్ ఎమ్యూజ్ మెంట్ రైడ్స్, స్టాల్స్, ఫుడ్ కోర్ట్స్ అలరిస్తాయని పేర్కొన్నారు. 8 ఎకరాల ప్రాంగణంలో పార్కింగ్ సదుపాయాన్ని ఉచితంగా ఏర్పాటు చేశామన్నారు. 18 మంది కార్మికులు నిరంతరం ఈ చేపల పర్యవేక్షణలో ఉంటారన్నారు. వీటిలో కొన్ని మాంసాహారం తినే రకాలతో పాటు విషపూరితమైన చేపలు కూడా ఉన్నాయని తెలిపారు.

మూడు నెలలపాటు సాగే ఈ ఎగ్జిబిషన్‌ను విజయవంతం చేయాలని ఆకాంక్షించారు. ఇక, అండర్ వాటర్ టన్నెల్ ఆక్వా ప్రదర్శనను వీక్షించిన సందర్శకులు.. తొలిసారిగా అండర్ వాటర్ టన్నెల్ ఆక్వా ప్రదర్శన చూస్తున్నామని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎగ్జిబిషన్ ఎంతగానో తమను ఆకట్టకుందని తమ అనుభూతులను పంచుకుంటున్నారు. హ్యాండ్లూమ్ హ్యాండిక్రాఫ్ట్ ఫన్ ఫెయిర్ అండర్ వాటర్ టన్నెల్ ఆక్వా ఎక్స్​ పో సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కుటుంబాలు, బంధుమిత్రులతో ఆహ్లాదంగా గడిపేందుకు చక్కని వేదికగా నిలుస్తోంది. సందర్శకుల ఆనందాన్ని రెట్టింపు చేసే విధంగా అలరిస్తుంది.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details