జవహర్ డంపింగ్ యార్డు 351 ఎకరాల్లో ఉంది. 14 మిలియన్ టన్నుల వ్యర్థాలు కొండల్లా పేరుకుపోయాయి. వేర్వేరు పొరలుగా కప్పేసి, గడ్డి మొలిచేలా చేసే క్యాపింగ్ పనులు మార్చి 2018కి పూర్తికావాల్సి ఉండగా.. ఇప్పటికీ ప్రక్రియ కొనసాగుతోంది. జాప్యంతో చుట్టుపక్కల వాతావరణం కాలుష్యమయమైంది. నగర శివారు ప్రాంతాలు అభివృద్ధిలో దూసుకుపోతుంటే.. ఇక్కడ ఆ పరిస్థితి కనిపించదు. ఓ వైపు దుర్వాసన, మరోవైపు గాలికి జనావాసాలపై ఎగిరొచ్చి పడే చిత్తు కాగితాలు, ప్లాస్టిక్ సంచులు, పక్షులు పడేసే వ్యర్థాలతోనే సమీప ప్రాంతాల జన ఇబ్బంది పడుతుంటే.. వ్యర్థాల కొండల నుంచి విడుదలయ్యే మురుగునీటితో భూగర్భ జలం కలుషితమవుతోంది. ఒప్పందం ప్రకారం ఈ దుష్పరిణామాలను రాంకీ సంస్థ ఎప్పటికప్పుడు నియంత్రిస్తుండాలి. కానీ పూర్తిస్థాయిలో జరగట్లేదని జీహెచ్‌ఎంసీయే చెబుతోంది. ‘‘అందుకు సంబంధించిన ప్రక్రియపై స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రభుత్వ ఇంజినీరింగ్ సంస్థ ఈపీటీఆర్‌ఐ ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తుంది. మూడు నెలలకోసారి నివేదిక ఇస్తుంది. డంపింగ్‌యార్డు నిర్వహణ ఒప్పందం ప్రకారం జరుగుతోందా, లేదా అనే అంశాలను ప్రస్తావిస్తుంది.’’ అని బల్దియా అధికారులు చెబుతున్నారు. నవంబరు, 2019 నుంచి జనవరి, 2020 కాలానికి ఇచ్చిన నివేదికలో వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణతోపాటు మరో రెండు అంశాల్లో నిర్వహణ సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఈపీటీఆర్‌ఐ స్పష్టం చేసింది.
చెరువు శుద్ధికి అంతర్జాతీయ టెండర్లు