తెలంగాణ

telangana

ETV Bharat / state

కేసీఆర్ సర్కార్ రెండోదఫా పాలనకు రెండేళ్లు.. నివేదిక విడుదల - కేసీఆర్ సర్కార్ రెండోదఫా పాలనకు రెండేళ్లు..

కేసీఆర్ సర్కార్ రెండోదఫా పాలనకు నేటికి రెండేళ్లు. తొలివిడతలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూ కొత్తవాటిని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. సంక్షేమానికి పెద్ద పీటవేస్తూనే.. వ్యవసాయరంగానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. రెండేళ్ల కాలంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.

two years completed for trs government in telangana
కేసీఆర్ సర్కార్ రెండోదఫా పాలనకు రెండేళ్లు.. నివేదిక విడుదల

By

Published : Dec 13, 2020, 5:42 AM IST

రెండోసారి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని తెరాస ప్రభుత్వం ఆదివారంతో రెండేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటోంది. 2018 డిసెంబరు 13 నుంచి ఇప్పటి వరకు పలు అభివృద్ధి పథకాలను, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది. ఈ సందర్భంగా రెండేళ్ల ప్రగతి నివేదికను శనివారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆ వివరాలు..

కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించడంతో పాటు రెండోదఫా రుణ మాఫీ పథకాన్ని.. నియంత్రిత సాగు విధానాన్ని అమల్లోకి తెచ్చింది. వ్యవసాయ, ఇతర ఆస్తుల నమోదుకు ధరణి వెబ్‌సైట్‌ను ఆరంభించింది. కొత్త జిల్లాలు, డివిజన్లు, నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు వచ్చాయి. కరోనా కాలంలో సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించింది. వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున చర్యలు చేపట్టింది. బీబీనగర్‌లో ఎయిమ్స్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రచరిత్రలో అమెజాన్‌ అతిపెద్ద పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. నూతన సచివాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం, పురపాలక, రెవెన్యూ చట్టాలు అమల్లోకి వచ్చాయి. రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా రేషన్‌ సరకులు తీసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. తెలంగాణ ప్రభుత్వ స్ఫూర్తితో కేంద్రం ఒకే దేశం- ఒకటే కార్డు విధానాన్ని ప్రవేశపెట్టింది. జీహెచ్‌ఎంసీలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించింది.

హైదరాబాద్‌లో అభివృద్ధి..

కేసీఆర్ సర్కార్ రెండోదఫా పాలనకు రెండేళ్లు.. ప్రభుత్వ నివేదిక విడుదల

గత ఏడాది నవంబరులో హైటెక్‌ సిటీ నుంచి రాయదుర్గం వరకు మెట్రోరైలు సేవలు మొదలయ్యాయి. 9 ఫ్లైఓవర్లు, 4 అండర్‌పాస్‌లు, 3 ఆర్వోబీలు ప్రారంభమయ్యాయి. సెప్టెంబరులో దుర్గం చెరువుపై కేబుల్‌ వంతెన నిర్మాణం పూర్తయింది. హైదరాబాద్‌లో భారీ వరదలు రాగా బాధిత కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. ఇకనుంచి ప్రతి ఇంటికీ, అపార్టుమెంట్లకు 20 వేల లీటర్ల దాకా ఉచితంగా మంచినీరు.. సెలూన్లు, లాండ్రీలు, దోబీఘాట్‌లకు ఉచిత విద్యుత్‌ ఇవ్వనుంది. రూ.13 వేల కోట్లతో హైదరాబాద్‌ మహా నగరానికి మురుగునీటి వ్యవస్థ నవీకరణ, గోదావరితో మూసీ అనుసంధానం చేపట్టనుంది.

కరోనా సమయంలో చేయూత..

కేసీఆర్ సర్కార్ రెండోదఫా పాలనకు రెండేళ్లు.. ప్రభుత్వ నివేదిక విడుదల

కరోనా సమయంలో ప్రతి వ్యక్తికీ నెలకు 12 కిలోల చొప్పున 4 నెలల పాటు ఉచితంగా రేషన్‌ బియ్యం, మూణ్నెల్ల పాటు 2 కిలోల చొప్పున కందిపప్పు అందజేసింది. గత ఏప్రిల్‌, మే నెలల్లో ఒక్కో కుటుంబానికి రూ.1500 ఆర్థిక సాయం ఇచ్చింది. కరోనా కాలానికి మోటారు వాహన పన్ను రద్దు చేసింది. కరోనా దృష్ట్యా పరిశ్రమలు, వ్యాపార సంస్థల విద్యుత్‌ కనెక్షన్లకు కనీస డిమాండ్‌ ఛార్జీల మినహాయింపు ఇచ్చింది.

పెరిగిన పెట్టుబడులు..

కేసీఆర్ సర్కార్ రెండోదఫా పాలనకు రెండేళ్లు.. ప్రభుత్వ నివేదిక విడుదల

అమెజాన్‌ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. వెబ్‌సర్వీస్‌ ద్వారా రూ.20,760 కోట్ల భారీ పెట్టుబడిని పెట్టేందుకు నవంబరులో నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.60 కోట్లతో బీ-హబ్‌ను చేపట్టింది. సిర్పూర్‌ కాగితం మిల్లును పునరుద్ధరించింది. ప్రోత్సాహాకాలతో కూడిన ఎలక్ట్రిక్‌ వాహనాల విధానాన్ని ప్రకటించింది. టీఎస్‌ఐపాస్‌ ద్వారా 14 వేల పరిశ్రమలకు అనుమతులిచ్చింది. రూ.2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులతో పాటు 15 లక్షల మందికి ఉపాధి లభించింది. ద్వితీయశ్రేణి నగరాలకు ఐటీ విస్తరించింది. ఇందుకు నూతన గ్రిడ్‌ విధానాన్ని ప్రకటించింది.

రైతుబంధు సాయం పెంపు..

కేసీఆర్ సర్కార్ రెండోదఫా పాలనకు రెండేళ్లు.. ప్రభుత్వ నివేదిక విడుదల

వ్యవసాయంలో 2019 వానాకాలం నుంచి రైతుబంధు పంట సాయం ఎకరాకు రూ.8 వేల నుంచి 10 వేల రూపాయలకు ప్రభుత్వం పెంచింది. దీనిద్వారా 56 లక్షల మంది రైతులకు లబ్ధి కలిగింది. ప్రభుత్వం చెల్లిస్తున్న రైతు బీమా ప్రీమియం రూ.2271 నుంచి రూ.3556 వరకు పెరిగింది. రెండో దఫా రూ.లక్షలోపు రుణమాఫీ పథకం కింద తొలివిడతగా రూ.25 వేలలోపు బాకీ ఉన్న 5.88 లక్షల మంది రైతులకు సంబంధించిన రుణాలు మాఫీ చేసింది.

చివరి ఆయకట్టు వరకు నీరు..

కేసీఆర్ సర్కార్ రెండోదఫా పాలనకు రెండేళ్లు.. ప్రభుత్వ నివేదిక విడుదల

ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2019 జూన్‌ 21న కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించారు. దీనిద్వారా సూర్యాపేట జిల్లాలోని చివరి ఆయకట్టు వరకు తొలిసారిగా గోదావరి జలాలు అందాయి. కరోనా సమయంలో గిట్టుబాటు ధర కల్పించడానికి 6408 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు జరిపింది. 2,604 గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణం చేపట్టింది.

ధరణికి శ్రీకారం..
కేసీఆర్ సర్కార్ రెండోదఫా పాలనకు రెండేళ్లు.. ప్రభుత్వ నివేదిక విడుదల

ఈ ఏడాది అక్టోబరు 29న మేడ్చల్‌ జిల్లా మూడు చింతలపల్లిలో ధరణి వెబ్‌సైట్‌ ప్రారంభమైంది. సాదాబైనామాల ద్వారా గ్రామాలు, పట్టణాల్లోని భూముల నమోదుకు అవకాశం కలిగింది. తహసీల్దార్లకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ బాధ్యతలు అప్పగించింది. సెప్టెంబరు 1న మరోసారి భూముల క్రమబద్ధీకరణ మొదలైంది. రాష్ట్రంలో 2019 మే నుంచి 39.35 లక్షల మందికి ఆసరా పింఛన్లు ఇచ్చింది. దీంతో కొత్తగా 8.5 లక్షల మందికి లబ్ధి చేకూరింది. 119 నియోజకవర్గాల్లో కొత్తగా బీసీ గురుకులాలు మొదలయ్యాయి. కోటిన్నర మందికి కంటి వెలుగు పరీక్షలు జరిగాయి.

ఇవీ చూడండి:'రాష్ట్రంలో డొమెస్టిక్​ ఎయిర్​పోర్టుల అభివృద్ధికి చర్యలు తీసుకోండి'

ABOUT THE AUTHOR

...view details