Two Inspectors Suspended In Cyberabad :సైబరాబాద్ పరిధిలో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లపై సస్పెన్షన్ వేటు పడింది. కేపీహెచ్‌బీ ఇన్‌స్పెక్టర్ వెంకట్, ఆర్జీఐ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తూ సీపీ అవినాశ్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. దంపతుల కేసు వ్యవహారంలో భర్తను కేపీహెచ్‌బీ ఇన్‌స్పెక్టర్ వెంకట్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి చితకబాదారనే ఆరోపణలతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ఇదే వ్యవహారంలో సీఐ వెంకట్ సహా సిబ్బందికి మెమోలు జారీ చేశారు. మరోవైపు ఇంకో కేసు విషయంలో నిర్లక్ష్యం వహించారని ఎయిర్‌పోర్టు పీఎస్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.
గృహ హింస కేసు బాధితుడు ప్రణీత్ తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లాకు చెందిన మొవ్వా ప్రణీత్‌కు అదే జిల్లాకు చెందిన శ్రీలక్ష్మితో 2018లో వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య వివాదం రావటంతో శ్రీలక్ష్మి, ప్రణీత్‌పై గుంటూరులోని దిశ పోలీస్ స్టేషన్లో(Disha Police Station) కేసు పెట్టి, అతడికి దూరంగా ఉంటుంది.
ప్రణీత్ హైదరాబాద్‌లో ఓ బ్యాంకులో మేనేజరుగా పనిచేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం శ్రీలక్ష్మి తన భర్త వేధింపులపై ఫిర్యాదు చేస్తూ తన సర్టిఫికెట్లు తన భర్త వద్దే ఉన్నాయని, తనకి న్యాయం చేయాలంటూ గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్లో(Nallapadu Police Station)ఫిర్యాదు చేసింది. కేసు విచారణలో ఉండగా మళ్లీ కేసు నమోదు చేయమని అక్కడి పోలీసులు ఫిర్యాదు తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో శ్రీలక్ష్మి, తన భర్త నిజాంపేట రోడ్డులో నివసిస్తూ ఉండటంతో కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
KPHB Police Case :విచారణ నిమిత్తం స్టేషన్‌కు పిలిపించిన కేపీహెచ్‌బీ పోలీసులకు, తనపై అప్పటికే కేసు నమోదై విచారణలో ఉన్నట్లు ప్రణీత్ తెలిపాడు. అయినా శ్రీలక్ష్మి సర్టిఫికెట్స్ ఇవ్వాలంటూ పోలీసులు అతడిని దూషిస్తూ, విచక్షణారహితంగా చితకబాదారని, దీంతో తనకు తీవ్రగాయాలయ్యాయని బాధితుడు తెలిపాడు. తనపై అకారణంగా దాడికి పాల్పడిన సీఐ, ఎస్సై, కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలంటూ ప్రణీత్ సామాజిక మాధ్యమం(Social Media) ద్వారా సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు.