TSRTC Charges: తెలంగాణ ఆర్టీసీ డీజిల్ సెస్సు పేరుతో మరోదఫా ప్రయాణికులపై భారీ భారాన్ని మోపింది. కిలోమీటరు ప్రాతిపదికన పల్లెవెలుగు నుంచి ఏసీ సర్వీసుల వరకు అన్నింటిపైనా ఛార్జీలను పెంచింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రయాణికులను మాత్రం ఈ పెంపు నుంచి మినహాయించింది. తాజా పెంపు గురువారం తొలి సర్వీసు నుంచి అమలులోకి వస్తుంది. ఈ ఏడాది మార్చిలో డీజిల్ సెస్సు పేరుతో గంప గుత్తగా ప్రతి ప్రయాణికుడిపై రూ. రెండు నుంచి రూ. అయిదు పెంచింది. తాజాగా కిలోమీటరు వారీగా డీజిల్ సెస్సును వడ్డించింది. విద్యార్థుల బస్సు పాసు ఛార్జీలను కూడా త్వరలో పెంచాలని నిర్ణయించింది. మార్చిలో డీజిల్, సౌకర్యాల సెస్సుల నుంచి టోల్‌ట్యాక్స్ వ్యత్యాసం, దగ్గరి రూపాయికి ఛార్జీల సవరణ పేరుతో భారీగా వడ్డించింది. ఆ పెంపుతో ప్రయాణికులపై సగటున 20 రూపాయల వరకు భారం పడిందని అంచనా. తాజా పెంపు దానికి అదనం. గురువారం నాటి ప్రయాణాలకు ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు అదనపు ఛార్జీలను చెల్లించాలి. డీజిల్ ధరల పెరుగుదలతో ఆర్టీసీపై భారం పడడమే అదనపు సెస్సుకు కారణమని సంస్థ చెబుతోంది.
నష్టాన్ని భరించలేకే..
డీజిల్ భారం భరించలేకే మరో దఫా సెస్సును పెంచాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్‌లు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘ప్రస్తుతం రోజుకు ఆరు లక్షల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తున్నాం. దీనివల్ల ప్రస్తుతం రోజుకు రూ. అయిదు కోట్ల నష్టం వస్తోంది. త్వరలో విద్యార్థుల బస్‌పాస్ ఛార్జీలను కూడా పెంచుతాం. 2019 తరువాత ఆ విభాగంలో ఛార్జీలు పెంచలేదు. పాసుల గడువు ముగిసేవరకు పాత విధానమే అమలులో ఉంటుంది’ అని వారు తెలిపారు.