ఆర్టీసీ కండక్టర్లుగా ఉద్యోగం చేయాలంటే పదో తరగతి పాసైతే చాలు. కానీ దేశంలో ఉన్న నిరుద్యోగానికి యువత డిగ్రీలు, పీజీలు చేసి కూడా కండక్టర్ల ఉద్యోగాలు చేస్తున్నారు. ఇటీవల ఆర్టీసీ యాజమాన్యం కార్గో సేవల కోసం మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు అర్హత కలిగిన కండక్టర్ల నుంచి దరఖాస్తులు కోరింది. అప్లికేషన్లు చూసిన యాజమాన్యం అల్ప ఉద్యోగితను చూసి ఆశ్యర్యపోయింది.
ఉన్నత విద్యావంతులే అధికం
టిక్కెటేతర ఆదాయంలో భాగంగా ఆర్టీసీ కార్గో సేవలపై సంస్థ దృష్టిసారించింది. ఇందు కోసం ఇప్పటికే పనిచేస్తున్న కండక్టర్లను.. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లుగా నియమించేందుకు నిర్ణయం తీసుకొంది. ఆసక్తి ఉన్నవారి నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఎంబీఏ, ఎంటెక్, ఎంసీఏ, ఎమ్మెస్సీ వంటి ఉన్నత విద్యనభ్యసించి కండక్టర్లుగా పనిచేస్తుండడం చూసి ఆశ్యర్యపోయారు. ఎంపికయిన 112 మందిలో 72 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉండగా.. 56 మందిలో ఒకటికన్నా ఎక్కువ డిగ్రీలు చేసిన వారు ఉన్నారు.