బతుకమ్మ పండుగ ఆర్టీసీకి ప్రాణం పోసింది. రాష్ట్రంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుపుకునే ఈ పండుగ టీఎస్ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. దసరాను పురస్కరించుకుని రవాణాశాఖ అధికారులు నడిపిన ప్రత్యేక బస్సులతో ఆదాయం అమాంతం పెరిగింది. పండుగ సీజన్లో మొత్తం రూ.3.36 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
బతుకమ్మ పండుగ సందర్బంగా ప్రయాణికులు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు ఈనెల 8వ తేదీ నుంచి 15 వరకు 3 వేలకు పైగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. మొదటి రోజు ప్రత్యేక బస్సుల్లో అధిక శాతం ఛార్జీలు వసూలు చేశారు. ఆ తర్వాత ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే వసూలు చేయాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. ఆ నిర్ణయంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. పండుగ వేళ ఆర్టీసీకి ఆదాయం పెరగడం పట్ల అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సజ్జనార్ ప్రత్యేక దృష్టి
ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్ ప్రత్యేక దృష్టి సారించారు. ప్రయాణికుల సంక్షేమమే లక్ష్యంగా ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేయవద్దని ఆదేశాలు జారీ చేశారు. ప్రయాణికుల సౌకర్యం, భద్రతే ధ్యేయంగా ఆర్టీసీ సేవలందిస్తుందని సజ్జనార్ వెల్లడించారు. ప్రయాణికులు చూపించే ఆదరాభిమానాలే సంస్థ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తాయని అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సజ్జనార్ సూచించారు.