RTC Special busses for mahashivratri: రాష్ట్రంలోని శైవాలయాలు మహా శివరాత్రి శోభను సంతరించుకున్నాయి. రేపే శివరాత్రి కావడంతో ఆలయాలు ముస్తాబయ్యాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆర్టీసీ కూడా ప్రత్యేక సేవలను అందించడానికి సిద్ధమైంది. టీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల నుంచి నుంచి వేములవాడ, శ్రీశైలం, కీసరగుట్ట, ఏడుపాయల, బీరంగూడలకు ప్రత్యేక బస్సు సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటితో పాటు వేములవాడ చుట్టూ ఉన్న జిల్లాల నుంచి నుంచి కూడా ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది. ఇక వేములవాడకు వచ్చే భక్తుల సౌకర్యార్థం 14 మినీ బస్సులను ఏర్పాటు చేశామని.. వీటిలో తిప్పాపూర్ బస్టాండ్ నుంచి దేవస్థానం వరకు భక్తులు ఉచితంగా ప్రయాణించవచ్చునని ఆర్టీసీ వెల్లడించింది.
ఆర్టీసీ స్పెషల్ సర్వీసెస్
రాష్ట్రంలో జరిగే వివిధ పండుగలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది. అందులో భాగంగా శివరాత్రి పర్వదినం సందర్బంగా శ్రీశైలం దేవస్థానానికి ఆర్టీసీ 155 ప్రత్యేక బస్సులను సిద్ధంచేసింది. ఈనెల 27 నుంచి వచ్చే నెల 2వ వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని.. భక్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని రంగారెడ్డి రీజనల్ మేనేజర్ వరప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఈనెల 27న -20 బస్సులు, 28న- 57బస్సులు, మార్చి 1న- 59బస్సులు, మార్చి 2న- 19బస్సులను నడిపిస్తున్నామన్నారు. బస్సులు ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్సుఖ్ నగర్, ఐఎస్ సదన్ ప్రాంతాల నుంచి అందుబాటులో ఉంటాయని ఆయన వెల్లడించారు.
ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నుంచి ఛార్జీలు
- సూపర్ లగ్జరీ- రూ.510
- డీలక్స్ - రూ.450
- ఎక్స్ ప్రెస్ - రూ.400లు
నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి ఛార్జీలు
- సూపర్ లగ్జరీ - రూ.550
- డీలక్స్- రూ.480
- ఎక్స్ ప్రెస్ - రూ.430
సద్వినియోగం చేసుకోవాలి..
హైదరాబాద్ గ్రేటర్ ఆధ్వర్యంలో ఈనెల 27 నుంచి వచ్చే నెల 4 వరకు ఈ ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు హైదరాబాద్ గ్రేటర్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. కీసరగుట్ట, ఏడుపాయల, బీరంగూడలకు ఈ ప్రత్యేక బస్సులను నడుపుతున్నామన్నారు. ఈసీఐఎల్ క్రాస్ రోడ్డు, తార్నాక, రెజిమెంటల్ బజార్, ఉప్పల్ క్రాస్ రోడ్, ఘట్కేసర్, వెంకటాపురం, అల్వాల్, అమ్ముగూడ, బాలానగర్ క్రాస్ రోడ్, మియాపూర్ క్రాస్ రోడ్, పటాన్ చెరుతో పాటు ముఖ్యమైన ప్రదేశాల నుంచి ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నామన్నారు. 30 మందితో కూడిన భక్తులు ఒక గ్రూపుగా ఏర్పడితే తమ నివాసానికి సమీప ప్రాంతం నుంచి ప్రత్యేక బస్సును ఏర్పాటు చేస్తామన్నారు. భక్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రేటర్ ఈడీ వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు.